buddha purnima : సిద్ధార్థుడు సన్యాసం తీసుకోవడానికి కారణమిదే !

-

సిద్ధార్థుడు యశోధరను వివాహం చేసుకుని రాహులుడనే కుమారుడిని కన్నాడు. చక్కగా సాఫీగా యువరాజు జీవితం సాగిపోతుంది. కానీ ఇలా ఉండగా.. ఒకనాడు ఎటువంటి కష్టాలు ఎదుర్కోని సిద్ధార్థుడు ఒకరోజు వ్యాహ్యాళి కోసం రాజప్రాసాదం నుండి బయటికి వచ్చి ఒక వృద్ధుని చూశాడు, మరోకరోజున ఒక రోగిని, ఇంకొక రోజున మృతకళేబరాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి ఛన్న ద్వారా ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెందాడు. ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. సిద్ధార్థుడు సామాన్య జీవితం గడపడం కోసం తన రథసారథి ఛన్న సహాయంతో ఒకరోజు రాజభవనం నుంచి కంటక అనే గుర్రంపై తప్పించుకున్నాడు.

సన్యాసిగా మారి జ్ఞానం సంపాదించాలని తలంచాడు. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలోని రాజగుహ అనే ప్రాంతంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. బింబిసార మహారాజ సేవకులు సిద్ధార్థుడిని గుర్తించి బింబిసారుడుకి తెలపడంతో బింబిసారుడు తన రాజ్యాన్ని బహూకరిస్తానని సిద్ధార్థుడితో తెలుపగా, సిద్ధార్థుడు తిరస్కరించి తన జ్ఞానసముపార్జన పూర్తయిన తరువాత మొదటగా మగధ సామ్రాజ్యానికి వస్తానని మాట ఇచ్చాడు. తరువాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టి అలరకలమ అనే సన్యాసి దగ్గర శిష్యరికం చేశాడు.

అలరకలమ తన బోధనలలో సిద్ధార్థుడి ప్రావిణ్యాన్ని చూసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని ఆ బోధనల వల్ల సిద్ధార్థుడి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో నిరాకరించాడు. తరువాత సిద్ధార్థుడు ఉదకరామపుత్త అనే యోగి దగ్గర శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షున్నంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్థుడి జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో తన వారసుడిగా ఉండమని కోరిన ఉదకరామపుత్త కోరికను కూడా తిరస్కరించాడు. వీరిద్దరి శిష్యరికం నుంచి తొలగిన సిద్ధార్థుడు కౌండిన్య అనే యోగి దగ్గర మరొక ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్య బృందం అంతా జ్ఞానసముపార్జన కోసం, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా విడిచిపెట్టడం సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని కానీ, ఒక గింజను కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకుని ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా నీరసంతో పడిపోయాడు.

అప్పుడు సిద్ధార్థుడు తాను ఎంచుకున్న మార్గం సరైనది కాదని నిర్థారించుకున్నాడు. తరువాత సిద్ధార్థుడు ధ్యానం, అనాపనసతి (ఉచ్చ్వాస నిశ్వాసాలు) ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను త్యజించడం ద్వారా). ఈ సమయంలోనే సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్ది ఆహారాన్ని, పాలను ఆహారంగా సేవిస్తూ ఉండేవాడు. దాని తరువాత సిద్ధార్థుడు బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడకి పరమసత్యం తెలుసుకోవడం కోసం భగవంతుడి ధ్యానం చేశాడు. కానీ కౌండిన్య గురువుకు అతని శిష్యులకు సిద్ధార్థుడు జ్ఞానసముపార్జన సాధన విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడిగా భావించారు. చివరకు సిద్ధార్థుడు తన 35వ యేట 49రోజుల ధ్యానం తరువాత జ్ఞానోదయం అయ్యింది. సిద్ధార్థుడికి భాద్రపద మాసంలో జ్ఞానోదయం అయిందని కొందరు, ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయం అయ్యిందని కొందరు చెపుతారు. ఆనాటి నుండి గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధిడిగా మారాడు, బౌద్ధ మతంలో సిద్ధార్థుడిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయిన బుద్దుడు అని పిలుస్తుంటారు. అలా సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version