కార్తీకం మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. అందులోనూ సోమవారం మరింత ప్రాధాన్యం కలిగిన రోజు. సోమవారంనాడు శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు. ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడియున్నది. ఈరోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలం లభిస్తుంది. నవంబర్ 4 సోమవారం రోజున శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈ రోజు దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం.
ఇక ఆలస్యమెందుకు సోమవారం ఎవరి శక్తి అనుసారం వారు దీక్షగా ఓం నమఃశివాయ పంచాక్షరితో భక్తి ప్రపత్తులతో శివుడికి దగ్గరగా ఉపేన వాసం.. అంటే ఉపవాసం చేయండి. అనంత పుణ్యఫలాలలను పొందండి. ఉపవాసాలు, నక్తాలు, దీక్షలను 8 ఏండ్లలోపు పిల్లలు, 80 ఏండ్ల దాటిన వారు చేయకూడదు. షుగర్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, శ్రామికులు, రైతులు వారికి అవకాశం ఉంటేనే చేయాలి. వారు చేయకున్నా దోషం లేదని పెద్దలు చెప్తున్నారు. వారి కర్మలను అంటే పనులను చేసుకుంటూ శివనామాన్ని భక్తితో జపిస్తే వారికి దీక్ష ఉన్న ఫలం లభిస్తుంది. గర్భిణులు, బాలింతలు, ఆపరేషన్ అయినవారు కూడా దీక్షలు చేయకున్నా దోషం లేదు. వారు కూడా తమ శక్తిమేరకు శివనామ జపం చేస్తే చాలు.
– కేశవ