ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో… ఏకంగా ఆరుగురికి… అధికార టీఆర్ఎస్ పార్టీ చోటు కల్పించింది. ఈ మేరకు ఆయా అభ్యర్థులను ప్రగతి భవన్ కు స్వయంగా ఫోన్ చేసి మరీ పిలిచారు సీఎం కేసీఆర్. 9:30 నుంచి 10:30 మధ్యలో ప్రగతిభవన్ లో ఉండాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం అందుతోంది.
ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థులను ప్రగతి భవన్ కు పిలిచారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు టిఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకోగా… కాసేపటి క్రితమే సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి కూడా వచ్చారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మరి కాసేపట్లోనే కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న సిద్దిపేట కలెక్టర్ ఈ పోస్టుకు వెంకటరామిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.