బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాల సందర్శన ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్ శ్రేణులు కోడిగుడ్లు, రాళ్లు, టామోటాలతో దాడి చేయడం, బీజేపీ కార్యకర్తలు సైతం దీటుగా స్పందించడం ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పర్యటనను టీఆర్‌ఎస్ ప్రతిఘటించడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత ఏడేండ్లుగా కేంద్రంతో సర్దుబాటు ధోరణితో వ్యహరిస్తున్న టీఆర్‌ఎస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆదిలోనే కమలం పార్టీకి అడ్డుకట్ట వేయాలనేది కారు పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది.
సరిగ్గా ఏడేండ్ల క్రితం.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చాయి. అప్పటి నుంచి ఇరుపార్టీలు సర్దుబాటు ధోరణితోనే ముందుకు సాగుతున్నాయి. పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తూ వచ్చింది. జీఎస్టీ మొదలుకొని అన్ని విషయాల్లో బహిర్గంగానే మద్దతు ఇచ్చింది. అలాగే, బీజేపీ సైతం టీఆర్‌ఎస్‌కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. కానీ, ఒకే ఒక ఎన్నిక ఇరుపార్టీల మధ్య నిప్పు రాజేసింది.
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయినా టీఆర్‌ఎస్ లైట్ తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినా కారు పార్టీ పట్టించుకోలేదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మాత్రం గులాబీ బాస్ కేసీఆర్‌కు మింగుడు పడటం లేదు. సర్వశక్తులు ఒడ్డినా 23,855 ఓట్ల తేడాతో ఓడిపోవడం పార్టీ అధ్యక్షుడు సహించలేకపోతున్నట్లు తెలుస్తున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంతో బీజేపీ దూకుడు పెంచడం, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండటంతో కమలం పార్టీకి కళ్లెం వేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వరుస ప్రెస్‌మీట్లతో బీజేపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక, ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్ శ్రేణులు బండి సంజయ్ సూర్యాపేట జిల్లా పర్యటనలో ఆటంకాలు కల్పించినట్లు తెలుస్తున్నది.