సీతారామం… ప్రేక్షకుల హృదయాలను స్పృశించిన ఈ హృద్యమైన దృశ్యకావ్యం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీలు సైతం మెచ్చుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రష్మిక కీలక పాత్రలో నటించింది. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ నిర్మించింది. ముఖ్యంగా హను రాఘవపూడి, జైకృష్ణ, రాజ్‌కుమార్ కందమూడి రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి.
ఈ చిత్రంలో కథానాయిక సీతామహాలక్ష్మి(మృణాల్), తన లేఖ ద్వారా హీరో రామ్(దుల్కర్)కు సంధించిన ప్రశ్న ‘కురుక్షేత్రంలో రావణ సంహారం! యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం’. సినిమాలో ఈ ప్రశ్నతో మొదలైన వారి ప్రయాణం, కథ పూర్తయ్యే సమయానికి ప్రేక్షకుల హృదయాలు బరువెక్కేలా చేస్తుంది. అయితే ఆ ప్రశ్నకు సినిమాలో హీరో రామ్ సమాధానం కనుగొన్నా, కొంతమంది ప్రేక్షకులకు ‘కుంజర యూదంబు’ ప్రశ్నలా మిగిలిపోయింది.
అయితే పరిశీలించి చూస్తే.. హనురాఘవపూడి ‘సీతారామం’ కథలోని వైవిధ్యాన్ని ఈ ప్రశ్న ద్వారా అక్షరీకరించారు. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశాన్ని ఈ ప్రశ్నలో అర్థవంతంగా, అందంగా ఇమిడించారని ప్రేక్షకులు అంటున్నారు.సీతారామం సినిమాలో హీరో-హీరోయిన్లు మొదటిసారి రెండు వర్గాల ఘర్షణలో కలుసుకుంటారు. ఆ సన్నివేశంలో వారి ఘర్షణను ‘కురుక్షేత్రం'(అన్నదమ్ముల గొడవ) గా ఈ ప్రశ్న ద్వారా హీరోయిన్ సీత అభివర్ణించింది. ఇక రావణసంహారం అంటే హీరో రామ్ ఆ గొడవలో అసలు కుట్రదారును బయటపెట్టి ఆ ఘర్షణను శాంతింపచేస్తాడు. ఆ సందర్భంలో చెడుపై రామ్ సాధించిన విజయం కాబట్టి దాన్ని ‘రావణసంహారం’ గా మార్చి ‘కురుక్షేత్రంలో రావణసంహారం’ అనే వాఖ్యాన్ని హీరోయిన్ సృష్టించింది.
ఇక ‘యుద్ధపు వెలుగులో సీతాస్వయంవరం’ అంటే.. ఆ సన్నివేశంలోనే కాగడాల వెలుగులో మొదటిసారి రామ్‌ని చూసిన సీతామహాలక్ష్మి అతడే తన భర్తగా నిశ్చయించుకుంటుంది. అదే ‘యుద్ధపు వెలుగులో సీతాస్వయంవరం’ అనే వాక్యం పుట్టడానికి కారణమయ్యింది. అప్పటినుంచే హీరో రామ్‌కు ‘ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి’ అని హీరోయిన్ ఉత్తరాలు రాస్తుంది. ఇలా హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశాన్ని తార్కికమైన ప్రశ్నలో సంక్షిప్తీకరించి, అద్భుతమైన ప్రేమ కథకు బీజం వేసిన దర్శకుడు హను రాఘవపూడిని ప్రేక్షకులు ‘వహ్వా’ అంటూ ప్రశంసిస్తున్నారు