‘పుష్ప’ కాలికి ఆరు వేళ్లు.. అసలు వేలిముద్రల కథేంటి!

-

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ నిన్న విడుదల చేశారు. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్‌ను ఖారారు చేయడంతోపాటు.. బన్నీ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందుకు సంబంధించి రెండు పోస్టర్‌లను విడుదల చేయగా.. అందులో బన్నీ పోలీసుల ముందు కూర్చొని ఉన్న పోస్టర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూర్తిగా చిత్తూరు యాస మాట్లాడే పుష్పరాజ్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు.

అయితే సినిమా టైటిల్‌పై వేలిముద్రలు కనబడేలా డిజైన్‌ చేయడం, రెండో పోస్టర్‌ను జాగ్రత్తగా గమనిస్తే బన్నీ ఎడమకాలుకు ఆరు వేళ్లు ఉండటం చూస్తుంటే.. ఈ చిత్ర కథ ఫింగర్‌ ప్రింట్స్‌ చుట్టూ తిరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. సుకుమార్‌ సినిమా కావడంతో మొత్తంగా ఫింగర్‌ ప్రింట్స్‌కు సంబంధించి ఈ చిత్రంలో పెద్ద ట్విస్టే ఉంటుందని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. అయితే అందులో నిజమెంతా ఉందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రంలో బన్నీ పాత్ర పేరు పుష్పరాజ్‌ అనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news