రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం. నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులతో కార్యచరణను సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నామని చెప్పారు.
ఏటీసీల్లో ఆధునాతన సామగ్రి ఏర్పాటు చేసి ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేలా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. అలాగే ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించనున్నట్లు చెప్పారు. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సర్టిఫికెట్తోతోపాటు నైపుణ్యం ఉంటేనే రాణించగలుగుతారని పేర్కొన్నారు.