కరోనా కట్టడికి ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్న విషయం విదితమే. ఇక మన దేశంలో రెండో విడత లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఇక మొదటి విడత లాక్‌డౌన్ మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు కొనసాగింది. అయితే లాక్‌డౌన్ వల్ల దాదాపుగా అన్ని ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు చెందిన కంపెనీ సర్వీస్ సెంటర్లు మూతపడడంతో.. రిపేర్ చేయాల్సిన ఆయా వస్తువుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. కొన్ని లక్షల సంఖ్యలో పాడైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పేరుకుపోయాయి. ఈ మేరకు సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (సీఐఈఏ), కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ)లు తెలిపాయి.
దేశంలో మొదటి విడత లాక్‌డౌన్‌లో ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు చెందిన కంపెనీల సర్వీస్ సెంటర్లు మూసి ఉండడం వల్ల.. పాడైన 50 లక్షల ఫోన్లు, 70వేల ఫ్రిజ్‌లు, 50వేలకు పైగా టీవీలు, 30వేలకు పైగా మైక్రోవేవ్ ఓవెన్‌లు, ఏసీలు.. కుప్పలుగా పేరుకుపోయాయని సీఐఈఏ, సీఈఏఎంఏలు వెల్లడించాయి. అయితే పలు కంపెనీలు చిన్న చిన్న సమస్యలకు కస్టమర్లకు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా సపోర్ట్‌ను అందిస్తూ వారే సమస్యను పరిష్కరించుకునేలా సహకరిస్తున్నాయి. అయినప్పటికీ రిపేర్ చేయాల్సిన ఆయా వస్తువుల సంఖ్య లక్షల్లో ఉందని ఆయా సంస్థలు తెలిపాయి.
కాగా సీఐఈఏ, సీఈఏఎంఏ సంస్థల్లో… ఎల్‌జీ, శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో, గోద్రెజ్, పానాసోనిక్, హయర్, సోనీ, ఆపిల్, హావెల్స్, హిటాచీ, లావా, మైక్రోమాక్స్ తదితర కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీల కస్టమర్ సర్వీస్ సెంటర్లకు నిత్యం వేల సంఖ్యలో వస్తువుల రిపేర్‌లకు సంబంధించిన కాల్స్ వస్తున్నాయని ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఆయా కంపెనీలు ఇచ్చిన రిపోర్టు మేరకు సీఐఈఏ, సీఈఏఎంఏ లు పైన తెలిపిన వివరాలను వెల్లడించాయి.
ఇక దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న షియోమీకి నిత్యం 11వేల వరకు ఫోన్ల రిపేర్‌కు సంబంధించి కాల్స్ వస్తున్నాయట. అయితే చిన్నపాటి సమస్యలకు గాను ఫోన్, ఈ-మెయిల్, చాట్ సపోర్ట్ ద్వారా కస్టమర్లే ఆయా సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని.. అయినప్పటికీ నిత్యం కస్టమర్లు తమ ఫోన్లు పాడయ్యాయని, రిపేర్‌కు ఇవ్వాలని పెద్ద సంఖ్యలో కస్టమర్ కేర్‌కు ఫోన్లు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం పరిమిత సంఖ్యలో కస్టమర్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తున్నందున కస్టమర్లు చేసే కాల్స్‌కు స్పందించడం కూడా చాలా ఆలస్యమవుతుందని.. ఆయా కంపెనీలు వెల్లడిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ ఎత్తేశాక.. మళ్లీ యథాతథ పరిస్థితులు నెలకొంటే అప్పుడు ఆయా కంపెనీలకు చెందిన సర్వీస్ సెంటర్లకు కస్టమర్లు పెద్ద ఎత్తున పోటెత్తడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ స్థితిని ఆయా కంపెనీలు ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి..!