విమానం బిజినెస్ క్లాస్‌లో పాము.. ప్రయాణికులు షాక్

-

విమానంలో విలాసవంతమైన బిజినెస్‌ క్లాస్‌లోకి ఓ పాము దూరి ప్రయాణికులను భయపెట్టింది. అమెరికాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వెళ్లే యునైటెడ్‌ ఫ్లైట్‌ 2038లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విమానం ప్రయాణం ముగించుకొని ల్యాండ్‌ అయిన సమయంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణికులు పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే న్యూజెర్సీలోని న్యూఆర్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో  సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని పామును పట్టుకొని అడవిలోకి వదిలేశారు. విమానంలో మరేమైనా జీవులు ఉన్నాయేమో అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

విమానంలో ఉన్న పామును కామన్‌ గ్రేటర్‌ స్నేక్‌గా అధికారులు గుర్తించారు. ఇది ఫ్లోరిడాలో విస్తృతంగా కనిపిస్తోంది. దీనిలో విషం ఉండదు. మనుషులపై దాడులకు కూడా ప్రయత్నించదని వన్యప్రాణి నిపుణులు వెల్లడించారు.

ఈ ఏడాది మొదట్లోనూ మలేషియాలోని ఎయిర్‌ ఏషియా విమానంలో ప్రయాణికుడిపై ఉన్న లైటులో పాము కనిపించింది.  ఈ పామును గుర్తించిన సమయంలో ఆ విమానం గాల్లో ప్రయాణిస్తోంది. అప్పట్లో ఈ పాము వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. ఇక 2016లో ఎయిర్‌ మెక్సికో విమానంలో గ్రీన్‌ వైపర్‌ జాతికి చెందిన పాము దర్శనమిచ్చి ప్రయాణికులను హడలగొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news