వికేంద్రీక‌ర‌ణ బీజేపీ కూడా చేసింది : సోము వీర్రాజు

వైసీపీ ప్ర‌భుత్వం తీరుపై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. అధికార వికేంద్రీక‌ర‌ణ వైసీపీ సొత్తు కాద‌ని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా వికేంద్రీక‌ర‌ణ బీజేపీ కూడా చేసింద‌ని కొత్త రాష్ట్రాల‌ను తీసుకువ‌చ్చింద‌ని సోము వీర్రాజు వివ‌రించారు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం బీజేపీ వికేంద్రీక‌ర‌ణ చేసింద‌ని కానీ రోడ్డు గుంత‌లు కూడా పూడ్చ‌లేని వారు వికేంద్రీక‌ర‌ణ గురించి మాట్లాడుతున్నారంటూ వైసీపీ స‌ర్కార్ ను ఉద్ద్యేశించి ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తిలోనే ఇల్లు కట్టుకున్నా అని ఇక్క‌డే రాజ‌ధాని అని వ్యాఖ్యానించిన సీఎం జ‌గ‌న్ ఆ మాట‌కు స‌మాధానం ఇవ్వాల‌ని ప్ర‌శ్నించారు.

తాను చెప్పిన మాట‌ల‌కు సీఎం జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉండాల‌ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖ‌ను ఏం అభివృద్ధి చేశారో చెప్పాల‌ని వీర్రాజు నిల‌దీశారు. రాజ‌ధాని గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదంటూ వీర్రాజు విమ‌ర్శ‌లు కురిపించారు. రాజ‌ధానిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా సీఎం అన్ని పార్టీల‌తో చ‌ర్చించి తీసుకోవాల‌ని చెప్పారు.