మాంచెస్టర్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా కలిసి పురుషుల గర్భ నిరోధక జెల్ ఔషధాన్ని తయారు చేశారు. దీన్ని పురుషులు భుజాలు లేదా వీపుకు రాసుకోవాలి.
సంతానం కలిగిన దంపతులు ఇక తమకు పిల్లలు అవసరం లేదని చెప్పి గర్భ నిరోధక పద్ధతులను పాటించడం సహజమే. అయితే ఈ విషయంలో స్త్రీలు గర్భ నిరోధక మాత్రలను వాడితే పురుషులు కండోమ్‌లను వాడి గర్భం రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే దంపతులిద్దరిలో ఎవరైనా ఒకరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు పద్ధతులే అయినప్పటికీ వీటి ద్వారా కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఎలాంటి శ్రమ లేకుండానే మరో నూతన గర్భ నిరోధక పద్ధతి అందుబాటులోకి రానుంది. అదే పురుషుల గర్భ నిరోధక జెల్..!
మాంచెస్టర్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా కలిసి ఈ పురుషుల గర్భ నిరోధక జెల్ ఔషధాన్ని తయారు చేశారు. దీన్ని పురుషులు భుజాలు లేదా వీపుకు రాసుకోవాలి. దీంతో ఈ జెల్ కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా చర్మంలోకి ఇంకిపోతుంది. చూడ్డానికి ఈ జెల్ కలబంద గుజ్జును పోలి ఉంటుంది. దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. అలా ఈ జెల్‌ను 6 నుంచి 12 వారాల పాటు వాడితే పురుషుల్లో వీర్యం ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఆ తరువాత శృంగారంలో పాల్గొన్నా పిల్లలు పుట్టరు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భ నిరోధక పద్ధతుల కన్నా చాలా ఉత్తమమైన, సౌకర్యవంతమైన పద్ధతి అని ఈ జెల్‌ను తయారు చేసిన పరిశోధకులు చెబుతున్నారు.
కాగా ఈ జెల్‌ను ఎడిన్‌బర్గ్ పీహెచ్‌డీ స్టూడెంట్ జేమ్స్ ఓవెర్స్ ఉపయోగించాడు కూడా. దీన్ని వాడిన తొలి వ్యక్తిగా అతని పేరు రికార్డులకెక్కింది. దీని ప్రయోగంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, ఈ జెల్‌ను తాను వాడానని, దీంతో తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని అతను చెబుతున్నాడు. అయితే ఈ జెల్‌ను వాడడం ఆపేస్తే మళ్లీ యథావిధిగా వీర్యం తయారవుతుంది. ఈ జెల్‌ను వాడడం ఆపిన 6 నుంచి 12 వారాల్లో మళ్లీ ఎప్పటిలాగే శుక్రకణాలు తయారవుతాయి. దీంతో సంతానం కావాలనుకుంటే అప్పుడు మళ్లీ యథావిధిగా శృంగారంలో పాల్గొని పిల్లలను కనవచ్చు.
కాగా ప్రస్తుతం ఈ జెల్‌కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ఆఖరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మెడిసిన్ మనకు అందుబాటులోకి వచ్చేందుకు మరో 2 ఏళ్ల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఇక ఈ జెల్‌లో ఉండే నెస్టోరోన్ (NES/T) అనే హార్మోన్ వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. అయితే ఈ జెల్‌ను వాడడం వల్ల వృషణాలకు, ఇతర అవయవాలకు ఎలాంటి హాని ఉండదని సైంటిస్టులు తెలిపారు. కాగా ఈ జెల్‌ను ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లకు చెందిన 450 మందిపై పరీక్షించామని, ఎక్కువ శాతం సత్ఫలితాలే వచ్చాయని, ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ జెల్ మాత్రం గర్భ నిరోధక పద్ధతులను మరింత సులభతరం చేయనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.