కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ప్రజలు షాపులకు వెళ్లి కొనడం కంటే ఆన్‌లైన్‌లోనే వస్తువులను ఆర్డర్ చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం విక్రయాలు కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభం అయ్యాయి. అయితే ఇకపై దేశవ్యాప్తంగా పెట్రోల్, సీఎన్‌జీలను కూడా వాహనదారుల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు.
ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఇకపై పెట్రోల్, సీఎన్‌జీలను వారి ఇళ్ల వద్దకే డెలివరీ చేయనున్నారు. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు కంపెనీలతో చర్చించారు. త్వరలోనే చమురు కంపెనీలకు ఆయా ఇంధనాలను హోం డెలివరీ చేసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. అదే ఖరారైతే ఇకపై వాహనదారులు గంటల తరబడి పెట్రోల్ కోసం పంపుల్లో నిరీక్షించాల్సి అవసరం లేదు. తమకు కావల్సిన పెట్రోల్‌ను ఇంటి వద్దకే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఎంతో మంది వాహనదారులకు ఉపయోగపడుతుంది.
అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేశాక కేంద్రం ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.