మొండోడు రాజుకంటే బలవంతుడు అంటారు. అలాంటిది ఆ రాజే మొండోడు అయితే… జగన్ లా ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు! ప్రజాసేవ చేసే విషయంలో, ప్రజలకు అనుకున్న సమయానికి సంక్షేమ పథాకాలు అందించే విషయంలో అప్పుచేసైనా మాట నిలుపుకోవాలనే మొండితనం జగన్ బలం అయితే… నిమ్మగడ్డ, సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం వంటి విషయాల్లో ఆ మొండితనమే బలహీతనత అవుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! వీటిలో ఇంగ్లిష్ మీడియం విషయంలో తల్లితండ్రుల నుంచి బలమైన మద్దతు సంపాదించుకున్న జగన్… మిగిలిన రెండు విషయాల్లోనూ కాస్త ఇబ్బందులే ఎదుర్కొంటున్నారని అంటున్నారు!
రాష్ట్రానికి కరోనా కారణంగా ఆదాయం పూర్తిగా పడిపోయింది… పైగా జగన్ అధికారం చేపట్టే నాటికే సుమారు రెండున్నర లక్షలకు పైగా బాబు అప్పు చూపించి వెళ్లారు! ఈ పరిస్థితుల్లో జగన్ నవరత్నాల పేరుతో విపరీతంగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ సమయంలో కరోనా పేరు చెప్పి మరే ముఖ్యమంత్రి అయినా కాస్త వెనక్కి తగ్గేవారు! ఆ సమయంలో జనాల్లో అర్ధం చేసుకునే వారు అర్ధం చేసుకుంటే… మిగిలిన వారు జగన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసేవారే! కానీ… ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో జగన్ మొండితనం ప్రజలకు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి.
ఖజానాలో డబ్బులు లేకపోయినా.. కరోనా వల్ల ఆదాయం ఆగిపోయినా కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఆగకుండదన్న మొండితనం… జగన్ ను జనాల్లో హీరోని చేసింది. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేస్తారు… కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మాట నిలుపుకున్నవాడే సిసలైన నాయకుడు అనే ప్రశంసలు కురిపించడానికి ఆ మొండితనమే కారణమయ్యింది. ఇదే సమయంలో హైకోర్టు నుంచి ప్రత్రికూల తీర్పులు ఎదురవుతున్నా కూడా… తాను అనుకున్న విషయంలో సుప్రీం మెట్లెక్కడానికి కూడా ఆ మొండితనమే కారణమవుతుంది! నిమ్మగడ్డ రమేష్ విషయంలో జగన్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎంత ఉందనేది వారికే తలియాలి! ఇక సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసే విషయంలో కూడా జగన్ మొండితనం కాస్త ఇబ్బంది కలిగిస్తుందనే అనుకోవాలి!
ఎందుకంటే… అసలు చంద్రబాబును ఇంటికి సాగనంపిన పాలసీలనే జగన్ కొన్ని తన మొండితనంతో కొనసాగిస్తున్నారు. ఇదే సగటు జగన్ అభిమానికి అంతుచిక్కని వ్యవహారంగా తయారయ్యింది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ పసుపు రంగులు వేశారు. దానివల్ల బాబుకు ఒరిగిందేమిటో 2019 ఎన్నికల్లో సుస్పష్టంగా కనిపించింది! ఇప్పుడు అదే పంథాను జగన్ తన మొండితనంతో కొనసాగించాలని అనుకుంటున్నారు! దాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టినా.. సంబంధిత జీవోను కొట్టి వేసినా కూడా జగన్ దీనిపై జగన్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.. అక్కడ కూడా నిరాశే ఎదురైనా తన మొండితనంతో ముందుకు వెళ్తున్నారే తప్ప… జగన్ కు ఏమాత్రం ప్రయోజనం కలిగించని ఈ రంగుల విషయాన్ని లైట్ తీసుకోవడం లేదు!
ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైనా జనాలకు వచ్చే ప్రయోజనంలో పెద్దగ తేడా ఉండదు.. దానివల్ల జగన్ క్రెడిట్ కి వచ్చిన డోకా కానీ, ప్రజల్లో జగన్ పాలనపై ఉన్న అభిప్రాయంకానీ ఏమీ మారదు! ఇక సచివాలయాలకు వైకాపా రంగులు వేసినా వెయ్యకున్నా జగన్ కున్న క్రెడిట్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు! అయినా కూడా జగన్ కు అంత మొండితనం ఏమిటో అర్ధం కావడం లేదు అనేది కొందరి వాదన! ఈ ఒకటి రెండు సంఘటనల మినహా… జగన్ మొండితనం జనాలకు చాలా ఉపయోగకరంగా పనిచేసిందనే చెప్పాలి! ఈ మొండోడు రాజవ్వడంతోనే కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమంలో కోతలు పడలేదు!!