రైళ్లలో ప్రయాణించేందుకు టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. రద్దీ మార్గాల్లోనైతే కనీసం 2 నెలల ముందుగానైనా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తత్కాల్‌లో టిక్కెట్లను కొనుగోలు చేస్తే స్థోమత చాలా మందికి ఉండదు. అయినప్పటికీ వాటిని కొందామన్నా అవి సెకన్ల వ్యవధిలోనే అయిపోతాయి. దీంతో రైలు ప్రయాణికులకు చికాకు వస్తుంది. అయితే ఇకపై ఆ బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే…
రైల్వే టిక్కెట్లను ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ వారు, ఏజెంట్లు బుక్ చేసేందుకు వీలు లేకుండా వారిపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్‌సభలో మాట్లాడారు. రైల్వే శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. రైల్వే టిక్కెట్లను పెద్ద ఎత్తున బుక్ చేసేందుకు ఏజెంట్లు, ప్రైవేటు ట్రావెల్స్ వారు ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీని వల్ల సామాన్యులకు రైలు టిక్కెట్లు దొరకడం లేదని తెలిపారు.
అయితే అక్రమంగా రైలు టిక్కెట్లను బుక్ చేసే వారిపై నిషేధం విధిస్తే సామాన్య ప్రజలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొరుకుతాయని మంత్రి అన్నారు. అందుకనే అలాంటి వారిపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. దీంతో సామాన్యులు ఏజెంట్ల అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో మరింత సులభతరంగా టిక్కెట్లను రిజర్వ్ చేసుకోవచ్చని అన్నారు. అయితే ఈ చర్యలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఆ వివరాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. కానీ ప్రయాణికుల సౌకర్యార్థం వీలైనంత త్వరగా ఆ నిషేధం అమలు చేస్తారని తెలుస్తోంది..!