బాలుగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్ని ఆ భాషల శ్రోతలకు గళపరిమళాన్ని పంచి, స్వర సామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగారు. కరోనాతో పోరాడిన బాలు చివరికి ఓడిపోయారు. కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో ఆగష్టు 4 న ఆయన చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఆయన కోలుకుంటున్నారని అంతా అనుకున్నారు. కానీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు ఆయన్ను బ్రతికించేందుకు శత విధాలుగా ప్రయత్నించారు.
ఆసుపత్రిలో చేరిన సందర్భంగా నాకు వచ్చింది జ్వరమే.. ఇప్పుడది తగ్గుముఖం పడుతోంది. రెండ్రోజుల్లో డిశ్చార్జి అయి వచ్చేస్తానూ… అంటూ అందరికీ వీడియో ద్వారా మాటిచ్చేశాడు. జలుబు, జ్వరం తప్ప నేను భేషుగ్గానే ఉన్నాను. జ్వరం కాస్త నెమ్మదించింది. ఇంకెంత… రెండ్రోజులే. డిశ్చార్జి అవుతాను.. ఇంట్లో ఉంటాను. నాకెంతో మంది ఫోన్లు చేస్తున్నారు. వారందరి కాల్స్ మాట్లాడలేకపోతున్నాను. నేను ఆసుపత్రిలో చేరడానికి వచ్చిన ముఖ్య కారణం విశ్రాంతి తీసుకోవడానికే. అందుకే ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను బాగానే ఉన్నాను, బాగానే ఉంటాను. ఎవరూ కంగారు పడవద్దు” అంటూ అందరినీ ఉద్దేశించి పలికారు.
కరోనా నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తులు కొలిమితిత్తుల్లా మారిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ నుంచి మాత్రం కోలుకోలేకపోయాడు. ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయనను పరామర్శించేందుకు విపరీతంగా ఫోన్లు చేయసాగారు. వారందరికీ సమాధానం చెప్పలేక బాలు ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులకు ఆయన అందించిన చివరి సందేశం బహుశా అదే అయ్యుంటుంది. కానీ వీడియోలో చెప్పినట్టుగా ఆయన రాలేకపోయాడు. అత్యంత విషాదాన్ని అందరిలో ఒలికిస్తూ, అనంతవాయువుల్లో లీనమయ్యాడు.