ప్రతీ ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవ మహా కార్యక్రమం నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎండీ వీసీ.సజ్జన్నార్ ఆదివారం ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ వరకు సిటీలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నగరంలోని కోఠి బస్‌స్టేషన్‌లో 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్‌లో 99592 26154 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇదిలాఉండగా, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్య క్షేత్రాలైన అరుణాచలం,శ్రీశైలం ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీస్ లను టీజీఎస్ ఆర్టీసీ నడుపుతోంది.