పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుస్తకాలంటే మక్కువ ఎక్కువ. ఆయన మాటల్లో ఎక్కువగా కొన్ని పుస్తకాల పేర్లు వినబడుతుంటాయి. సెప్టెంబర్ 2 ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ ప్రస్తావించిన కొన్ని పుస్తకాల గురించి తెలుసుకుందాం.
“డబ్బుతో కొనలేని అలౌకిక ఆనందాన్ని అందించేది.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది.. దోచుకోవడానికి అవకాశంలేని సంపదనిచ్చేది.. పుస్తకం”.. పవన్ కల్యాణ్ తన ట్విట్టర్లో రాసుకున్న మాటలివి. తెలుగు చిత్ర పరిశ్రమతో పవన్‌కల్యాణ్‌ను ఎలా వేరు చేసి చూడలేమో, పుస్తకాలను ఆయన్ను వేరు చేసి చూడటమూ అంతే కష్టం. పుస్తకాల మీద ఉన్న ప్రేమను, ఇష్టాన్ని పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు. సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనను ప్రభావితం చేసిన, ఆయన చదవమని సూచించిన కొన్ని పుస్తకాలేంటో ఓసారి చూద్దాం.
తాకట్టులో భారతదేశం
పవన్ చిన్నప్పుడు బడికి వెళ్తుంటే గోడల మీద ‘తాకట్టులో భారతదేశం’ అనే పదాలు ఆయనను ఆలోచనలో పడేసేవని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంటర్‌లో ఉండగా వాళ్ల నాన్న దగ్గరనుంచి ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకాన్ని తీసుకొని చదివారు. ఆ పుస్తకంలో చర్చించిన అంశాలు, అందులోని సారాంశం తనపై చాలా ప్రభావం చూపిందని చెబుతుంటారు పవన్. ఈ సమాజాన్ని ఆ పుస్తక రచయిత తరిమెల నాగిరెడ్డి విశ్లేషించిన తీరు ఆలోచింపజేసిందని చెప్పారు. అందులో చర్చించిన అంశాలు ఈనాటికి వర్తిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గడ్డి పరకతో విప్లవం
జపాన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త మసనోబు ఫుకుఓకా. పురుగుల మందులు, రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేయడం కన్నా సహజ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించొచ్చని నిరూపించారు. ఆయన చేసిన పరిశోధనలు, అభిప్రాయాలను ‘గడ్డి పరకతో విప్లవం’ అనే పుస్తకంలో వెల్లడించారు. ఇది కూడా పవన్‌కు ఇష్టమైన పుస్తకమే. అందుకే ఈ పుస్తకాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని ఓసారి సూచించారు.

లాంగ్ వాక్ టు ఫ్రీడమ్
స్వేచ్ఛ కోసం 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు నెల్సన్ మండేలా. ఆయన రాసిన ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ కూడా ఆయనను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ‘బద్రి’ సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని స్వయంగా వెళ్లి చూసి వచ్చారు. ఆయన పోరాట పటిమ తనలో స్ఫూర్తి నింపిందంటారు పవన్.

వనవాసి
అది ‘గబ్బర్ సింగ్’ చిత్రీకరణ జరుపుకొంటున్న సమయం. ‘వనవాసి’ చదవాలని పవన్‌కు ఆసక్తికలిగింది. కానీ, వెతికితే ఆ పుస్తకం దొరకలేదు. ఈ విషయాన్ని తనికెళ్ల భరణికి చెప్పారు. ఎలాగో ఆ పుస్తకం చివరకు పవన్ చేతుల్లోకి చేరింది. ‘గబ్బర్‌సింగ్’ సాధించిన విజయం కన్నా ‘వనవాసి’ పుస్తకం చేతుల్లోకి తీసుకున్న క్షణాల్లో ఎక్కువ ఆనందం పొందానని చెబుతారాయన. తను ప్రకృతిలో మమేకం అయ్యేలా ప్రభావితం కారణం ‘వనవాసి’ పుస్తకమేనని చెబుతారు. ఈ పుస్తకాన్ని బెంగాలి రచయిత బిభూతి భూషన్ బంధోపాధ్యాయ రాశారు.

మార్టిన్ లూథర్‌కింగ్, చేగువేరా
అందరూ తప్పకుండా చదవాలని పవన్ చెప్పిన వాటిలో మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకాల ప్రభావం ఆయనను కొన్నేళ్లపాటు వెంటాడిందని చెప్పుకొచ్చారాయన. చెగువేర జీవితం, సాహిత్యం కూడా తనలో అంతే ఆవేశాన్ని రగిలించిందని చెబుతాడు పవన్.

గుంటూరు శేషేంద్ర శర్మ
ఒక విధంగా నేటి యువతకు గుంటూరు శేషంద్ర శర్మను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఆయన ఉపన్యాసాల్లో తరచూ వినిపించే కవిత్వం శేషేంద్రశర్మదే. ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశం’ పుస్తకాలు పట్టుకుని పవన్ కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన కుమారుడి కోరిక మేరకు కొన్ని పుస్తకాలను మళ్లీ ముద్రించేందుకు పూనుకొని శేషేంద్రపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు..

పవన్ ప్రస్తావించిన మరికొన్ని పుస్తకాలు
- ఐ ద సిటిజన్

- ఖరవేలుడు

- తొలి పొద్దు

- అమృతం కురిసిన రాత్రి
