పాస్‌వర్డ్‌ అడిగిన నెటిజన్‌.. ఆకాశో చోప్రా రిప్లై అదుర్స్

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రాకు సోషల్ మీడియాలో ఓ సరదా సంఘటన ఎదురైంది. ఓ నెటిజన్ చిలిపి ప్రశ్నకు ఆకాశ్ ధీటైన సమాధానమిచ్చారు. ఆయన సమాధానానికి మిగతా నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టివ్‌గా ఉండే ఆకాశ్‌ అభిమానులతో ఆట గురించిన తన విశ్లేషణలు పంచుకుంటుంటాడు. తాజాగా ఓ అభిమాని తన సమస్యకు పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్‌ చేయగా దానికి స్పందిస్తూ.. ‘మిత్రమా.. ఇది మన ఛానెల్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి ఓ తుంటరి నెటిజన్‌ ‘అయితే పాస్‌వర్డ్‌ చెప్పండి’ అంటూ కామెంట్‌ చేశాడు. అతడికి ఈ మాజీ ఆటగాడు ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘శ్రమ.. సృజనాత్మకత.. పట్టుదల’’ అదే పాస్‌వర్డ్‌ అంటూ సరదాగా స్పందించాడు.  మొత్తానికి ఓ సీనియర్‌ ఆటగాడు తన కామెంట్‌కు బదులివ్వడం సంతోషంగా ఉందంటూ సదరు వ్యక్తి తెలిపాడు. ‘థాంక్యూ.. ఈ పాస్‌వర్డ్‌ పనిచేస్తుంది’ అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.