మూడో టెస్టులో టీం ఇండియాకు షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. ఆయన కుటుంబంలో తలెత్తిన వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణంగా ఆయన ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ ట్విట్టర్ లో తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆయనకు అండగా ఉన్నామని పేర్కొంది. అయితే..రవిచంద్రన్ అశ్విన్ రాజ్కోట్ టెస్టు నుంచి అత్యవసరంగా వైదొలగి ఇంటికి వెళ్లడం వెనుక కారణం ఏంటన్న చర్చ నెట్టింట నడుస్తోంది.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల అందుకు గల కారణాన్ని వెల్లడించారు. ‘అశ్విన్ తల్లి వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెతో ఉండేందుకే ఆయన రాజ్ కోట్ టెస్టు నుంచి హుటా హుటిన ఇంటికి వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఈ టెస్ట్ లో మిగిలిన మూడు రోజులపాటు అశ్విన్ ఇక ఆడరని తెలుస్తోంది. అయితే..మెరిలీబోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం అశ్విన్ స్థానంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ను తీసుకునేందుకు ఎంపైర్లు అవకాశం కల్పిస్తారు. ప్లేయర్ గాయపడ్డ లేక అస్వస్థతకు గురైన అప్పుడు ఆ అవకాశం ఇస్తారు. ఎంసీసీ రూల్స్ ప్రకారం 24.1.1.2 ప్రకారం కూడా సబ్స్టిట్యూట్ ఆటగాడిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక అశ్విన్ స్థానంలో సబ్స్టిట్యూట్ గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు.