ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో ఇటీవలే భారత్, న్యూజిలాండ్‌ల మధ్య మొదటి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ మ్యాచ్ జరిగిన విషయం విదితమే. అందులో న్యూజిలాండ్ విజయం సాధించింది. మొదటి టెస్టు చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న జట్టుగా నిలిచింది. ఇక ఆగస్టు 4 నుంచి రెండో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న పటౌడీ సిరీస్‌తో రెండో సైకిల్ ప్రారంభమవుతుంది.
2021 ఆగస్టు నుంచి జూన్ 2023 వరకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2 సైకిల్ కొనసాగుతుంది. ఇందులో భారత్ మొత్తం 19 టెస్టులను ఆడుతుంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంకలతో టెస్టులను ఆడుతుంది. ఇక డబ్ల్యూటీసీ 2 కు క్వాలిఫికేషన్ రూల్స్ ను ఐసీసీ మార్చింది.
డబ్ల్యూటీసీ మొదటి సిరీస్‌లో జట్లు ఒక సిరీస్ గెలిస్తే 120 పాయింట్లను ఇచ్చేవారు. కానీ కేవలం 2 టెస్టులు మాత్రమే ఆడితే అది జట్లకు లాభం చేకూర్చుతుంది. 5 టెస్టుల సిరీస్‌ను ఆడే జట్లకు నష్టం కలుగుతుంది. దీంతో ఈ విషయమై జట్లు ఐసీసీకి ఫిర్యాదు చేశాయి. అందువల్ల పాయింట్లను ఇచ్చే విధానాన్ని మార్చారు.
ఇకపై పైన తెలిపిన రెండేళ్ల సైకిల్‌లో ఆయా జట్లు ఆడే ఒక్కో టెస్టు మ్యాచ్ విన్‌కు 12 పాయింట్లను ఇస్తారు. వారు ఎన్ని సిరీస్‌లు ఆడినా సరే సిరీస్ పరంగా కాకుండా మ్యాచ్‌ల పరంగా పాయింట్లను ఇస్తారు. దీంతో గెలిచిన జట్టుకు 12 పాయింట్లు వస్తాయి. డ్రా అయితే 4 పాయింట్లు, టైగా ముగిస్తే 6 పాయింట్లు ఇస్తారు. ఇక అన్ని జట్లు ఒకే సంఖ్యలో మ్యాచ్‌లను ఆడతాయి. దీంతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన రెండు జట్లకు మళ్లీ ఫైనల్‌ను నిర్వహిస్తారు. ఇలా డబ్ల్యూటీసీ 2 కొనసాగుతుంది.