ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఇన్ని రోజుల పాటు సజావుగా సాగింది. అయితే ఇద్దరు కోల్‌కతా ప్లేయర్లు కోవిడ్ బారిన పడడంతో ఐపీఎల్ జరుగుతుందా, లేదా అని మరోసారి అనుమానాలు వస్తున్నాయి. కోల్‌కతా ప్లేయర్లైన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు కోవిడ్ బారిన పడ్డారు. వారికి కోవిడ్ ఎలా సోకింది ? అన్న విషయం పక్కన పెడితే.. ఫ్యాన్స్ మాత్రం ఐపీఎల్ ఇప్పుడు అవసరమా ? నిషేధించండి.. అని డిమాండ్ చేస్తున్నారు.
బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నప్పటికీ వారికి కోవిడ్ సోకడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. వారు బయో సెక్యూర్ బబుల్‌ను బ్రేక్ చేశారా ? అని అనుమానిస్తున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ముగ్గురు సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడడం కలకలం రేపుతోంది. దీంతో ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేయాలని, తరువాత ఎప్పుడైనా మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
అయితే బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌ను ఆపే ప్రసక్తే లేదని చెప్పింది. కోల్‌కతా ప్లేయర్లు ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారని, అందువల్ల సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ను ఇంకో రోజుకు వాయిదా వేశామని బీసీసీఐ తెలియజేసింది. అయితే కోల్‌కతాకు చెందిన ఆ ప్లేయర్లు బయో సెక్యూర్ బబుల్‌ను బ్రేక్ చేశారని, అందుకనే కోవిడ్ సోకి ఉంటుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.