దేశంలో కరోనా విస్ఫోటనంతోపాటు పలువురు ప్లేయర్లు, సిబ్బంది కోవిడ్ బారిన పడడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను బీసీసీఐ వాయిదా వేసిన విషయం విదితమే. దీంతో ప్లేయర్లను సొంత దేశాలకు పంపిస్తున్నారు. కొందరు ఆసీస్ ప్లేయర్లు, సిబ్బందిని వివిధ దేశాలకు పంపి క్వారంటైన్‌లో ఉంచారు. ఆ గడువు ముగియగానే వారు తమ సొంత దేశానికి వెళ్లనున్నారు. అయితే ఐపీఎల్ 2021 వాయిదాతో బీసీసీఐ గుణపాఠం నేర్చుకుందా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
అనేక దేశాల్లో కోవిడ్ 2, 3 వేవ్‌లు వచ్చాయి. కానీ భారత్‌లో కోవిడ్ మొదటి వేవ్ ముగియగానే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని భ్రమించారు. ఓ వైపు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అన్నింటికీ అనుమతులు ఇచ్చారు. ఎన్నికలు, ఇతర అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఫలితం.. కరోనా పుట్ట బద్దలైంది. రోజూ 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. కరోనా పంజా విసరడంతో ఐపీఎల్‌ను కూడా వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు టోర్నీని నిర్వహించేది చెప్పలేదు. కానీ నిపుణుల మాటలు ముందుగానే విని ఉన్నా లేదా టోర్నీ ఆరంభంలో దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కనుక అప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉన్నా.. ఇప్పుడు ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి వచ్చేది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాల్లో బీసీసీఐ ముందుగానే మేల్కొని ఉంటే టోర్నీని దుబాయ్ లేదా ఇంగ్లండ్‌లో నిర్వహించి ఉండేవారని, ఇంత అప్రతిష్టను మూట గట్టుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని అంటున్నారు.
ఇక గత సీజన్‌లో యూఏఈలో ఐపీఎల్‌ను సమర్థవంతంగా నిర్వహించారు. కేవలం 3 వేదికలకే ఐపీఎల్‌ను పరిమితం చేశారు. కానీ ఇప్పుడు 6 వేదికల్లో ఐపీఎల్ ను నిర్వహించారు. అయితే ప్రేక్షకులను స్టేడియాల్లోకి ఎలాగూ అనుమతించడం లేదు కదా, అలాంటప్పుడు 6 వేదికల్లో ఐపీఎల్ ఎందుకు, 3 వేదికల్లో, అది కూడా కోవిడ్ కేసులు తక్కువగా ఉన్న నగరాల్లో నిర్వహించి ఉంటే బాగుండేది కదా, అలా చేయలేదు కనుకనే ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక గత ఐపీఎల్ సీజన్‌లో ఓ విదేశీ సంస్థకు బయో సెక్యూర్ బబుల్ బాధ్యతలను అప్పగించారు. కానీ ఇప్పుడా సంస్థకు కాకుండా దేశీయంగా ఉన్న సంస్థకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారు బయో సెక్యూర్ బబుల్‌ను నిర్వహించడంలో ఫెయిలయ్యారు. అందువల్లే ప్లేయర్లు, సిబ్బందికి కోవిడ్ వచ్చింది. ఇది కూడా బీసీసీఐ ఫెయిల్యూర్లలో ఒకటి. ఇన్ని జరగడం వల్లే బీసీసీఐ ఇప్పుడు గుణపాఠం నేర్చుకుందని, ముందుగానే ఊహించి పక్కా ప్రణాళికతో టోర్నీని నిర్వహించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇకనైనా బీసీసీఐ మరిన్ని జాగ్రత్తలతో భవిష్యత్తు టోర్నీలను నిర్వహిస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.