ఐపీఎల్: చేజేతులా మ్యాచ్ పోగొట్టుకున్న సన్ రైజర్స్..

ఐపీఎల్ లో జరుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచులో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో 17పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది. 190పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ టీమ్ కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12పరుగుల వద్ద ఉన్నప్పుడు వార్నర్ వికెట్ పడిపోవడం జట్టు పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు.

కానీ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్ భాగస్వామ్యంతో ఒక దశలో గెలుపు వైపు వెళ్ళింది. కానీ స్టాయినిస్ వారిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టి మ్యాచుని మలుపు తిప్పాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ వచ్చి మెరుపులు మెరిపించి మ్యాచు ఇంకా సన్ రైజర్స్ వైపు ఉందనుకునేలా చేసాడు. కానీ రబాడ వేసిన ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడడంతో మ్యాచు ఢిల్లీ కేపిటల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొత్తం 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 172పరుగులు చేయగలిగింది.

సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లలో కేన్ విలియమ్సన్ 67పరుగులు (45బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు), అబ్దుల్ సమద్ 33పరుగులు (16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), మనీష్ పాండే 21పరుగులు (14బంతుల్లో 3ఫోర్లు), ప్రియమ్ గార్గ్ 17పరుగులు (12బంతుల్లో 2సిక్సర్లు) చేసారు. మిగతా వారిలో ఎవ్వరూ పెద్ద చెప్పుకోదగిగా ఆడలేదు. ఢిల్లీ బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు, స్టాయినిస్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.