టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశ్నల బాణాలు సంధించారు. టీ20 ప్రపంచకప్ కోసం స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన దీపక్ చాహర్‌ను కాదని ఉమేశ్ యాదవ్‌ను ఎందుకు ఆడించారో చెప్పాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందని గావస్కర్ పేర్కొన్నాడు. మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్లను కాదని ఇతర ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం సరైందకాదని అభిప్రాయపడ్డాడు.
“ప్రపంచకప్‌లో ఉమేశ్ యాదవ్‌ను ప్రధాన జట్టులోకి గానీ.. స్టాండ్‌బై ప్లేయర్‌గానీ తీసుకోలేదు. అలాంటి సందర్భంలో ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎందుకు అవకాశం కల్పించారు? భారత జట్టు మేనేజ్‌మెంట్ కచ్చితంగా చెప్పాల్సిన ప్రశ్న అని నేను అనుకుంటున్నా. షమీ కరోనా బారిన పడటంతో ఉమేశ్‌ను తీసుకొచ్చారు. అతడు బౌలింగ్‌లో లయను అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకే తర్వాతి ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాహర్ విషయంపై స్పష్టత ఇస్తే కానీ.. మనం ఏదీ మాట్లాడలేం” అని గావస్కర్ అన్నారు.