కరోనా వల్ల 2020లో ఐపీఎల్ ఏప్రిల్‌లో జరగాల్సింది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య నిర్వహించారు. అయితే ఇంకో 3 నెలలు గడిస్తే మళ్లీ ఐపీఎల్ టోర్నీ రానే వస్తోంది. ఇక ఇది చాలదన్నట్లు అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నమెంట్ సిద్ధమైంది. అదే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నమెంట్. దీన్ని మినీ ఐపీఎల్‌గా భావిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఈ టీ20 టోర్నీలో పాల్గొంటున్నాయి.
ఈ టోర్నీ జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఒక్కో గ్రూప్‌కు 6 ఎలైట్ టీమ్‌ల చొప్పున మొత్తం 5 గ్రూపుల్లో టీమ్‌లు తలపడతాయి. ఇక మరో గ్రూప్‌లో 8 ప్లేట్ టీమ్‌లు ఉంటాయి. ఈ క్రమంలో టోర్నీ ఫైనల్స్‌ను జనవరి 26 నుంచి నిర్వహిస్తారు. ముంబై, వడోదర, ఇండోర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
మహారాష్ట్ర, కేరళ, ముంబై, సౌరాష్ట్ర, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన టీంలు ఇందులో పాల్గొంటాయి. ఈ టోర్నీని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. యాప్‌లో హాట్ స్టార్‌తోపాటు జియో టీవీలో పలు చానళ్లలో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.