ఆ నియోజకవర్గంలో మంత్రి గారి కంటే భార్య పెత్తనం ఎక్కువైందా ?

-

భార్య పదవిలో ఉంటే.. పెత్తనం భర్తది. రాజకీయాల్లో ఇది కామన్‌. ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్‌ రివర్స్‌. శ్రీవారు మంత్రిగా బిజీగా ఉండటంతో.. నియోజకవర్గం మొత్తం కవర్‌ చేస్తున్నారట శ్రీమతిగారు. కొబ్బరికాయలు కొట్టడం దగ్గర నుంచి రిబ్బన్‌ కటింగ్‌ల వరకు అంతా మేడమ్‌గారే చూసుకుంటున్నారట. ఈ దంపతుల పొలిటికల్‌ అండర్‌స్టాండింగ్‌ పై సిక్కోలు జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

ఆమె మంత్రి కాదు..ఎమ్మెల్యే కాదు. చివరకు గ్రామ సర్పంచ్ కూడా కాదు. కానీ.. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, పవర్ బోర్లు వంటి కార్యక్రమాలకు కొబ్బరి కాయలు కొడతారు. ఫొటోలకు పోజులిస్తారు. ఆ కార్యక్రమాలకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు కొట్టేస్తారు. ఇంతకీ ఆమె ఎవరంటారా? ఏపీ పశుసంవర్థక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. పలాస ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజుకు 6 నెలల కిందట అనుకోని వరంలా మంత్రి పదవి దక్కింది. భర్తకు బుగ్గ కారు రావటంతో శ్రీదేవి స్పీడయ్యారట.

బీసీ మత్స్యకార కోటాలో మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడు కావటంతో అదే సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు దక్కింది. తొలిసారి ఎమ్మెల్యే అయినా సామాజికవర్గ ఈక్వేషన్‌ కలిసి వచ్చింది. అప్పలరాజు ఎమ్మెల్యే కాకముందు డాక్టర్‌. ఆ సమయంలో శ్రీదేవి భర్త చాటు భార్యనే అని చెబుతారు. భర్త ఎమ్మెల్యే అయ్యాక కొంచెం యాక్టివ్‌ అయినా.. మంత్రి పదవి వచ్చాక మాత్రం గేర్‌ మార్చారట.మంత్రి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోతేనేం.. మేడమ్‌ ఉన్నారుగా అని పలాసలోని పార్టీ కేడర్‌ ఓపెన్‌గానే కామెంట్‌ చేస్తున్నారట. కొత్త సంవత్సరం క్యాలెండర్ల, డైరీల ఆవిష్కరణలన్నీ శ్రీదేవి చేతుల మీదుగానే జరిగింది. ఇవన్నీ ప్రైవేట్‌ కార్యక్రమాలని అనుకుంటే.. అధికారిక, అభివృద్ధి ప్రోగ్రామ్స్‌ సైతం చక్కబెట్టేస్తుండటంతో చూసేవాళ్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారట.

మంత్రిగారి భార్య కదా.. ఏం చెబితే తమ మీదకు ఏం వస్తుందో అని అధికారులు కూడా మరో మాట మాట్లాడటం లేదట. కామ్‌గా మేడమ్‌ను ఫాలో అయిపోతున్నారట. గరుడభద్ర పంచాయతీ టీ.గడూరు, హరిజనపేట, మర్రిపాడుల్లో సీసీ రోడ్లు, పవర్‌ బోర్‌ ప్రారంభోత్సవం చేశారు శ్రీదేవి. పలాస, కాశీబుగ్గలో పవర్‌ బోర్డు వాటర్‌ ట్యాంక్స్‌ ప్రారంభానికి కూడా హాజరయ్యారు. ఇలాంటి లిస్ట్‌ పెద్దగానే ఉన్నట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గొర్రెల పెంపకం కార్యక్రమానికి మంత్రి రాలేకపోతే.. మంత్రిగారి భార్యను పిలుస్తున్నారట. పిలవడమే ఆలస్యం శ్రీదేవి వచ్చి మిగిలిన నేతలతో సమానంగా వేదిక పంచుకుంటున్నారు.

శ్రీదేవి మంత్రి భార్య కాబట్టి ఎవరూ ప్రశ్నించే సాహసం చేయడం లేదు. కానీ.. చాటుగా చాలా ప్రశ్నలపై చెవులు కొరుక్కుంటున్నారట. ఇంట్లో మంత్రి ఉంటే.. భార్య ఇతర కుటుంబ సభ్యులు ప్రొటోకాల్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేయొచ్చా అని ప్రశ్నిస్తున్నారట. మంత్రి అందుబాటులో లేని సమయంలో ఏ నిబంధనల ప్రకారం.. ఎలాంటి హోదాలో ఆమెను ఆహ్వానిస్తున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయట. ప్రొటోకాల్‌ నిబంధనలపై అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అసలే పలాస రాజకీయ వేడితో రగులుతోంది. కులాలు, కుటుంసభ్యులను రచ్చకీడుస్తున్నారు. ఈ సమయంలో శ్రీదేవి వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందా అని పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతుందట…

Read more RELATED
Recommended to you

Latest news