సెమీస్ కు ముందు పాక్ జట్టుకు ఎదురుదెబ్బ …ఆ ఇద్దరు ఆడేది డౌటే..!

ఆస్ట్రేలియాతో కీలకమైన సెమీ ఫైనల్స్ లో పాక్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తాకింది. ఆ జట్టులో కీలక ఆటగాళ్లు ఫ్లూతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. మరో స్టార్ ఆటగాడు
షోయబ్ మాలిక్ ఇద్దరు ఫ్లూతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. తాజాగా ఇద్దరు ప్రాక్టీస్ కు రాకపోవడంతో అనుమానాలు నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెమీఫైనల్స్ లో వీరిద్దరు కీలకం కానున్నారు. అయితే ప్రస్తుతం పాక్ వీరి సేవలను కోల్పోయే అవకాశం ఉంది. ఇద్దరికి పరీక్షలు చేయగా కోవిడ్ నెగిటివ్ వచ్చినా..ఫ్లూతో బాధపడుతుండటంతో వైద్యులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. గురువారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రిజ్వాన్, మాలిక్ ఆడుతారా.. లేదా..? అనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పాక్ ఓపెనర్ రిజ్వాన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత 5 మ్యాచుల్లో 214 రన్స్ చేశాడు. మరోవైపు షోయబ్ మాలిక్ మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాడిగా ఉన్నారు. స్కాట్లాండ్ మ్యాచ్ లో కేవలం 18 బాల్స్ లోనే 50 పరుగులు చేసిన మాలిక్ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. అయితే వీరిద్దరు గురువారం జరిగే మ్యాచ్ కు అందుబాటులో లేకుంటే వీరి స్థానంలో సర్పరాజ్ అహ్మద్, హైదర్ అలీలను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బాబార్ ఆజామ్ సారథ్యంలోని పాక్ జట్టు ప్రపంచ కప్ టోర్నీ-2021 లో ఒక్క ఓటమి లేకుండా సెమీస్ కుచేరారు. ప్రస్తుతం ఫైనల్ పై గురిపెట్టారు.