ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం నిజానికి బ్యాట్స్‌మెన్‌కు బాగా అనుకూలిస్తుంది. అందుకనే గతంలో ఇంగ్లండ్ ఇక్కడ భారీ స్కోర్లు నమోదు చేయగలిగింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను మట్టి కరిపించి విజయానందంలో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు నేడు మరో పోరుకు సిద్ధమైంది. నాటింగామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ ఇవాళ వరల్డ్ కప్‌లో తన రెండో మ్యాచ్ ఆడనుంది. అందులో భాగంగా ఇంగ్లండ్ ఇవాళ్టి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. అయితే ఒక మ్యాచ్‌లో గెలిచి విజయోత్సాహంలో ఇంగ్లండ్ ఉండగా, మరోవైపు పాకిస్థాన్ గత మ్యాచ్‌లో పోయిన తన పరువును నిలబెట్టుకునేందుకు యోచిస్తోంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. తదితర అన్ని అంశాల్లోనూ పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను పాకిస్థాన్ అడ్డుకుంటుందా.. అనే విషయం సందేహంగానే మారింది.
గతంలో నాటింగామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లలో వన్డేలలోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. గతంలో ఒకసారి పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఈ మైదానంలో వన్డేల్లో 3 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆ తరువాత ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 481 పరుగుల భారీ స్కోరు చేసి వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌పై ఇంగ్లండ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ 400 పై చిలుకు పరుగులు చేయాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం నిజానికి బ్యాట్స్‌మెన్‌కు బాగా అనుకూలిస్తుంది. అందుకనే గతంలో ఇంగ్లండ్ ఇక్కడ భారీ స్కోర్లు నమోదు చేయగలిగింది. మరి ఇవాళ కూడా ఇదే మైదానంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆ స్థాయి స్కోరు నమోదవుతుందా..? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అలా జరగాలంటే ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి ఆ స్థాయి స్కోరు నమోదు చేయాలంటే.. గత మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకుని, అన్ని అంశాల్లోనూ బాగా రాణించాలి. మరి పాక్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఇంగ్లండ్ విజయాలకు అడ్డుకట్ట వేస్తుందా, లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది..!
ఇంగ్లండ్ జట్టు (ప్రాబబుల్ ఎలెవెన్): .జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్ జట్టు (ప్రాబబుల్ ఎలెవెన్): ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబం అజామ్, హారిస్ సొహెయిల్, సర్ఫరాజ్ అహ్మద్, మహమ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం/షాహీన్ అఫ్రిది/మహమ్మద్ హస్నెయిన్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, వహబ్ రియాజ్, మహమ్మద్ అమీర్.