ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఆ జట్టు ఓటమి పాలైంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఓటమి, విరాట్ కోహ్లీ ఔట్, ప్రస్తుత సీజన్‌లో తమ ప్లేఆఫ్స్ అవకాశాలపై బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తన ఔట్‌పై కూడా అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్లతో చర్చించిన సంగతి తెలిసిందే.
దీనిపై డుప్లెసిస్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఔట్ విషయంలో నిబంధనలు అలా ఉన్నప్పుడు తామేం చేయలేం కానీ, బంతి నడుంపైకి వస్తున్నట్లు అనిపించిందని అన్నాడు. అయితే, థర్డ్ అంపైర్ క్రీజ్‌ను బేస్ చేసుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఉందన్న డుప్లెసిస్.. ఒక జట్టుకు ఇది కరెక్ట్ అనిపించినా.. అవతలి వారికి సరైంది కాదనే అభిప్రాయం ఉండటం సహజమేనని చెప్పాడు.
‘చివరి వరకూ పోరాడి కేవలం ఒక్క పరుగుతో ఓటమిపాలు కావడం నిరుత్సాహానికి గురి చేసింది. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోని బౌలింగ్ విభాగం రాణించింది. రజత్ పటీదార్ – విల్ జాక్స్ మంచి భాగస్వామ్యంతో మ్యాచ్‌లో మేం ముందుండేలా చూశారు. నరైన్ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.