భారత్ లీగ్ దశ నుంచే విజయాలు సాదిస్తే పాజిటివ్‌గా ముందుకు వెళ్లవచ్చని, దీంతో ఫైనల్ చేరి కప్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని రవిశాస్త్రి అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ ఫేవరెట్ టీం మ్యాచ్‌లు ఎప్పుడు ఉన్నాయా.. అంటూ వరల్డ్ కప్ షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వైపు ఆటగాళ్లు కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి లండన్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 జరగనుండా, అంతకు వారం ముందు నుంచే.. అంటే.. ఈ నెల 24వ తేదీ నుంచి వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వాటి కోసం కూడా ఆయా జట్లకు చెందిన ప్లేయర్లు ఇప్పటికే సిద్ధమయ్యారు.
అయితే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న భారత జట్టుకు వరల్డ్ కప్‌ను సాధించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఆరంభంలో విజయాలు లభిస్తే ప్లేయర్లలో జోష్ పెరిగి పాజిటివ్ ధోరణి అలవాటు అవుతుందని, దీంతో ఆ తరువాత జరిగే మ్యాచ్‌లలోనూ సులభంగా విజయం సాధించవచ్చని రవిశాస్త్రి అన్నారు. 2015లో ప్రపంచ కప్ జరిగినప్పుడు కేవలం రెండు లేదా మూడు జట్లు మాత్రమే కప్‌ను సాధించేందుకు అర్హత కలిగి ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటి జట్ల సంఖ్య పెరిగిందని కూడా రవి అన్నారు.
ఇక ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని రవిశాస్త్రి అభిప్రాయ పడ్డారు. ఇంగ్లండ్ ప్లేయర్లు చక్కని ఫాంలో ఉన్నారని, అలాగే ఆస్ట్రేలియా జట్టులో గతేడాది జట్టుకు దూరమైన కీలక ఆటగాళ్లు వచ్చేశారని, దీంతోపాటు గత వరల్డ్ కప్‌లో ఆడిన చాలా ప్లేయర్లు ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నారని, అందుకని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతుందని రవి అన్నారు. అలాగే ఇంగ్లండ్‌లో ఉండే వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని, అక్కడి పిచ్‌లు కౌంటీ పిచ్‌లలా ఉండవని, భిన్నంగా వాటిని తయారు చేస్తారని రవి అన్నారు.
భారత్ లీగ్ దశ నుంచే విజయాలు సాదిస్తే పాజిటివ్‌గా ముందుకు వెళ్లవచ్చని, దీంతో ఫైనల్ చేరి కప్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని రవిశాస్త్రి అన్నారు. భారత జట్టులో కేఎల్ రాహుల్, పాండ్యా జట్టులోకి తిరిగి రావడం సంతోషకరమని, ప్లేయర్లందరూ తమ తమ తప్పులను తెలుసుకుని మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శనను ఇస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని రవి తెలిపారు. అయితే ప్లేయర్లందరూ స్థిరంగా ఆడాలని, టోర్నమెంట్ మొత్తం పాజిటివ్‌గా ముందుకు సాగాలని.. అది జరిగితే భారత్ ప్రపంచ కప్ సాధించడం సులభతరం అవుతుందని రవిశాస్త్రి అన్నారు. మరి రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత జట్టు వరల్డ్ కప్ సాధిస్తుందా, లేదా అన్నది తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు..!