2024 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో రాజస్థాన్ వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం రోజున జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు పొందింది. బెంగళూరు నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ను 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. జాస్ బట్లర్ (100* పరుగులు), కెప్టెన్ సంజూ శాంసన్ (69 పరుగులు, 42 బంతుల్లో; 8×4, 2×6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లే 2, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ సూపర్ సెంచరీ (113 పరుగులు, 72 బంతుల్లో ; 12×4, 4×6)తో బెంగళూరుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ (44 పరుగులు, 33 బంతుల్లో) రాణించాడు. ఇది బెంగళూరుకు వరుసగా మూడో ఓటమి. ప్రస్తుత సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ నాలుగు మ్యాచ్ల్లో ఓడి కేవలం ఒక దాంట్లోనే నెగ్గింది.