T20 ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్‌లో ఒకరైన కుల్‌దీప్ యాదవ్‌కు సొంత గడ్డ కాన్పూర్‌లో ఘన స్వాగతం లభించింది. కుల్దీప్ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. టపాసులు, డోలు చప్పుళ్ల మధ్య ఊరేగిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కుల్‌దీప్ తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయం వెల్లడించాడు.
తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నానంటూ అభిమానులకు కుల్‌దీప్ తీపి కబురు చెప్పాడు. అయితే గత కొంత కాలంగా ఓ బాలీవుడ్ నటితో అతడు స్నేహం కొనసాగిస్తున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెతోనే వివాహం అని అందరూ భావిస్తుండగా ఆ విషయాన్ని కుల్దీప్ కొట్టిపారేశాడు. తాను పెళ్లి చేసుకోబోయేది సినిమా రంగానికి చెందిన వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చాడు. తనను, కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమన్న కుల్దీప్.. దీనిపై త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతానని అన్నాడు. మరోవైపు వరల్డ్ కప్ గెలవడంపై కుల్‌దీప్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ క్షణాల కోసం చాలా కాలం నుంచి వేచి చూసినట్లు తెలిపాడు.