రెండో టి20 కూడా మనదే…!

-

ఆక్లాండ్ వేదికగా 5 టి20ల సీరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 లో టీం ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్, యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ లు రాణించడంతో టీం ఇండియా ఘన విజయం సాధించింది. దీనితో 5 మ్యాచుల సీరీస్ లో భాగంగా టీం ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుని భారత బౌలర్లు కట్టడి చేసారు.

దీనితో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ గుప్తిల్ 33 పరుగులు, మున్రో 26 పరుగులు, సేయిఫ్రేట్ ఆఖర్లో పోరాడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ ఏ దశలోనూ భారీ స్కోర్ దిశగా వెళ్ళలేదు. స్వల్ప లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు ఫోర్లతో ఊపు మీదున్న రోహిత్ శర్మ 8 పరుగులకే సౌథీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా 11 పరుగులకే అవుట్ కాగా తర్వాత వచ్చిన యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యార్ ఆదిలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత సిక్సులతో ఆకట్టుకున్నాడు. అయితే మరో 8 పరుగులు అవసరం అనుకున్న తరుణంలో భారి షాట్ కి ప్రయత్నించి 33 బంతుల్లో మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 44 పరుగులు చేసి, ఇష్ సోదీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

మరో 2.3 ఓవర్లు ఉండగానే టీం ఇండియా విజయం సాధించింది. ఓపెనర్ రాహుల్ 50 బంతుల్లో రెండు సిక్సులు మూడు ఫోర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో శివం దుబే సిక్స్ కొట్టి మ్యాచ్ ని ముగించాడు. 17.3 ఓవర్లలో టీం ఇండియా 135 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా, ఠాకూర్, బూమ్రా, దుబే తలో వికెట్ తీసారు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు సోదీ ఒక వికెట్ తీసారు. మూడో మ్యాచ్ ఇరు జట్ల 29 న హామిల్టన్ వేదికగా జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే మ్యాచ్ టీం ఇండియా సొంతం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news