రష్యాలో స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం విదితమే. అందులో భాగంగానే మొత్తం 40వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహించనున్నారు. కాగా ఫేజ్ 1/2 ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి 7 మంది వాలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. ఈ మేరకు ది లాన్సెట్ జర్నల్‌లో ట్రయల్స్ వివరాలను ప్రచురించారు.
కాగా స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌కు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినప్పటికీ అవి చాలా స్వల్పంగా ఉన్నాయని మురాష్కో వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న అందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరగగా, నీరసం, కండరాల నొప్పి వంటి స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపించాయన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత నుంచి అప్పుడప్పుడూ శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగిందని, అంతకు మించిన తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని, అందువల్ల స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్ సురక్షితమని అన్నారు.
ఇక ఫేజ్ 3 ట్రయల్స్‌కు చెందిన వివరాలను అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రచురిస్తారు. కాగా స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ రష్యా నుంచి అనుమతి పొందింది. ఈ వ్యాక్సిన్‌కు డాక్టర్ రెడ్డీస్ భారత్‌లో ఫేజ్ 2, 3 ట్రయల్స్ ను నిర్వహించనుంది.