ఇది నిజమేనా… ఏపీ స‌హా ఐదు రాష్ట్రాల్లో శ్రీ‌లంక త‌ర‌హా సంక్షోభం త‌ప్పదా..?

-

చూశారా? శ్రీ‌లంక‌ పరిస్థితి ఎలా తయారయ్యిందో? ఇందుకు కారణం అత్యంత అనాలోచితంగా ఉచిత పథకాలు అమలు చేయడమే. వీటిని ఆపేయకుంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రజల పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుంది.తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఉచిత పథకాలను ఆపకుంటే ప్రజలు ధరల భారంతో కుంగిపోకతప్పదని, నిత్యావసరాలైన బియ్యం, కూరగాయలు, నూనెల వంటి ధరలు పెరిగి ప్రజల నడ్డి విరగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. మరి ఈ వాదనల్లో నిజమెంత? వాస్తవమెంత?

 

శ్రీ‌లంక‌ సంక్షోభం నేప‌థ్యంలో మ‌నందేశంలోనూ కొన్నిరాష్ట్రాల్లో ఇలాంటి ప‌రిస్థితి ఏర్పడ‌నుంద‌ని ఆందోళ‌న‌లు వ్యక్తమ‌వుతున్నాయి. శ్రీ‌లంక ఇష్టారాజ్యంగా అప్పులు చేసి ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను సోమరులను చేసిందని, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోందని అంటున్నారు. కాబట్టి అప్పులు భారీగా చేస్తున్న మనదేశంలోని రాష్ట్రాలు అప్పులను తగ్గించి ఉచిత పథకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మొద‌ట శ్రీ‌లంక సంక్షోభానికి కారణాలేమిటో స్థూలంగా తెలుసుకుందాం. ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యం సముపార్జనలో ప్రధాన వాటా టూరిజానిది. ఆ తర్వాత రబ్బరు, యాలకులు,దాల్చిన, రంగురాళ్లు టీపొడి, కాఫీ వంటి వాణిజ్య పంటలు.బ్రిటీష్ వలస విధానం కారణంగా.ఆ దేశ అవసరాలకు అనుగుణంగా ఇక్కడి ప్రజలు మొదటి నుంచీ వాణిజ్య పంటలనే పండించారు.అంతేగానీ ఆహార పంటలపై మొగ్గుచూపలేదు. వరి పండించినా గోధుమ, పాలు వంటి డెయిరీ ఉత్పత్తులను విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నారు.వాటిపైనే ఆధారపడ్డారు. అయితే కోవిడ్ కారణంగా టూరిజం రంగం అతలాకుతలమైంది.ఎగుమతులకు డిమాండ్ తగ్గింది.దాంతో విదేశీ మారకద్రవ్యం కొరత ఏర్పడింది. పర్యవసానంగా వివిధ అభివృద్ధి పథకాల కోసం ప్రపంచ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో సమస్యలు తలెత్తాయి. రానురాను అది మరింత ముదిరి సంక్షోభానికి దారితీసింది.విదేశీమారకద్రవ్యం లేకపోవడంతో ఆహార పదార్థాలను దిగుమతులు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్యాస్, పెట్రో ల్ కు తీవ్ర కటకట ఏర్పడింది.

 

ఈ నేప‌థ్యంలో.. చేతికే ఎముకే లేద‌న్నట్లుగా ఉచిత ప‌థ‌కాలను విస్తారంగా అమ‌లు చేస్తున్న మ‌న దేశంలోని ప‌లు రాష్ట్రాలు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కొన‌క త‌ప్పదనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ర్ట జీడీపీలో 30 శాతానికిపైగా అప్పులు చేసిన పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, కేర‌ళ‌, ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే ప‌రిస్థితి రానుంద‌ని అంటున్నారు. నిజానికి.. రాష్ట్రాలు నేరుగా విదేశాల నుంచి అప్పులు తీసుకోలేవు. కేంద్రం అనుమ‌తి ఉంటేనే ప్రపంచ‌బ్యాంకు లేదా ఆసియా అభివృద్ధి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇక దేశీయ రుణాలను కేంద్రం అనుమ‌తించిన ప‌రిమితి మేర‌కు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేర‌కే రాష్ర్టాలు అప్పులు తీసుకుంటున్నాయి కూడా. వీటిని ప‌రిశీలించిన‌ప్పుడు మ‌న‌కు ఒక విష‌యం అర్థమ‌వుతోంది. శ్రీ‌లంక ఎదుర్కొంటున్నది విదేశీ అప్పులు, విదేశీ మారకద్రవ్యం కొరత మూలంగా ఏర్పడినదని. అంతేగానీ.. ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల కాదని. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే విదేశీ మార‌క ద్రవ్య నిల్వల స‌మ‌స్య లేదు. ఆహార ప‌దార్థాల‌ను దిగుమ‌తి చేసుకునే అగ‌త్యం అంత‌క‌న్నా లేదు. ముఖ్యంగా.. మ‌న దేశం నుంచి వివిధ పారిశ్రామిక‌, ఐటీ ఉత్పత్తులు ఎగుమ‌తి అవుతున్నాయి.

 

ఈ సంద‌ర్భంలో సంక్షోభం వ‌స్తుంద‌నుకోవ‌డం ఊహాజ‌నితమే అవుతుంది. మ‌రీ ముఖ్యంగా అతి చిన్న దేశ‌మైన శ్రీ‌లంక‌తో ఇండియాను పోల్చడం మ‌రింత అవివేకం. ఇక రాష్ర్టాల విష‌యానికి వ‌స్తే..అవేమి సొంత ఆర్థిక వ్యవ‌స్థను క‌లిగిలేవు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే శ్రీ‌లంక‌లా మారుతాయని అనడం దుర్బద్ధితో కూడుకున్నదే అవుతుంది తప్ప మరొకటి కాదని నిపుణులు అంటున్నారు. అయితే అప్పులు ఎప్పటికైనా ముప్పేనని, ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news