సూడాన్‌లో సైన్యానికి, శక్తిమంతమైన పారామిలిటరీ దళానికి మధ్య మొదలైన పోరులో ఒక్కరోజు వ్యవధిలోనే 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 670 మంది గాయపడ్డారు. మృతుల్లో భారతదేశ వాసి అల్బర్ట్ అగస్టీన్ ఒకరు. అక్కడి ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఆయన స్వస్థలం కేరళలోని కన్నూర్. ఐరాస ఆహార సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
రాజధాని ఖార్తూమ్ సహా వివిధ ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. దీంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆశలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‌లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ‘శీఘ్ర మద్దతు దళం’ (ఆర్‌ఎస్‌ఎఫ్)తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. పరిస్థితిని కొలిక్కి తీసుకురావడానికి రాజకీయ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు మొదలైనా.. ఈ ఉద్రిక్తతల నడుమ అది సాధ్యం కాలేదు. జనసమ్మర్ద ప్రాంతాలపై కాల్పులు జరుపుతుండడంతో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇలాంటిది మునుపెన్నడూ లేదని స్థానికులు చెబుతున్నారు.