పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. కలెక్టరేట్ లో తండ్రి, కుమారుడి ఆత్మహత్యాయత్నం.

తెలంగాణలో భూసమస్యలకు చెక్ పెట్టే విధంగా ధరణి వెబ్ సైట్ ను ప్రారంభించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. చాలా చోట్ల రైతులకు పాస్ బుక్ లు రాక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం చూస్తునే ఉన్నాం. పాస్ పుస్తకాలు రాలేదంటూ రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలు గతంలో చూశాం. తాాజాగా ఇటాంటి సంఘటనే భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో మళ్లీ చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భువనగిరికి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం ఎనిమిది ఎకరాల భూమిని రూ6000 వేలకు కొనుగోలు చేశాడు. దానిలో నాలుగు ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకం కోసం ఆప్లై చేయగా.. ఇప్పటికి మంజూరు కాలేదు. దీంతో ఆవేదన చెందిన ఉప్పలయ్య, అతని కుమారుడు భువనగిరి కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కలెక్టర్ ఛాంబర్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. కలెక్టరేట్ కార్యాయలం చుట్టూ తిరిగినా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదని విసుగు చెందిన ఉప్పలయ్య ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు మహేష్ తో ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా ఇద్దరు పెట్రోల్ పోసుకోవడం గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి సమస్యను తెలుసుకుని.. సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.