మైనింగ్ లీజులకు సంబంధించిన వ్యవహారంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోరెన్, ఝార్ఖండ్ సర్కార్ అప్పీళ్లను కోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది.
హేమంత్ సోరెన్ గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనకు తానే ఒక గని లీజును మంజూరు చేసుకున్నారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఝార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణయోగ్య వ్యాజ్యాలుగా పేర్కొంటున్నామని హైకోర్టు జూన్ 3న తీర్పు వెలువరించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటిదాకా పెండింగ్ పిటిషన్లపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై హేమంత్ సోరెన్ ట్విటర్‌లో స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అని రాసుకొచ్చారు.
सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq
— Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022