ఆధునిక వైద్య విధానాలను విమర్శిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాందేవ్ బాబా అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అల్లోపతి వైద్యులు.. ఔషధాలు, కరోనా వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేయడంపై భారత వైద్య మండలి(ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచారణ జరిపారు. అల్లోపతి వైద్యులపై రాందేవ్ బాబా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని సీజేఐ ప్రశ్నించారు. రాందేవ్ బాబా యోగాకు ప్రాచుర్యం కల్పించారు. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించడం తగదని ఆయన వెల్లడించారు. ఆయన అనుసరిస్తున్న విధానాల వల్లే అన్ని అనారోగ్య సమస్యలను నయం చేస్తాయన్న గ్యారెంటీ లేదన్నారు. దీనిపై రాందేవ్ బాబా స్పందన తెలియజేయాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.