పతంజలి గ్రూప్‌కు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనిల్ మందును ఆ పేరిట అమ్మకూడదంటూ చెన్నైకి చెందిన ఆరుద్ర ఇంజినీర్స్ అనే కంపెనీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కరోనా సమయంలో కరోనిల్ అనే పదం వాడడాన్ని అడ్డుకుంటే ఆ ఉత్పత్తికి అంతకు మించిన దారుణం మరొకటి ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది.
పతంజలి సంస్థ ఇటీవలే కరోనాకు మందు కనుగొన్నామంటూ కరోనిల్ పేరిట ఓ ఔషధాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే కరోనాను నయం చేసే మందుగా దానికి తాము అనుమతి ఇవ్వలేదని, రోగ నిరోధక శక్తిని పెంచే మందుగానే దానికి అనుమతి ఇచ్చామని, అందువల్ల పతంజలి ఆ మందును కరోనాను నయం చేస్తుందని చెప్పకూడదని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. దీంతో పతంజలి కరోనిల్‌ను రోగ నిరోధక శక్తి పెంచే మందుగా మార్చి మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది.
అయినప్పటికీ పతంజలికి చుక్కెదురైంది. సదరు ఆరుద్ర ఇంజినీర్స్ కంపెనీ కరోనిల్ అనే పేరును తాము రిజిస్టర్ చేశామని, అందువల్ల ఆ పేరును పతంజలి వాడకూడదని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో కోర్టు విచారించి పై విధంగా తీర్పు ఇచ్చింది. ఇక ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సూచించడంతో ఆరుద్ర కంపెనీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని వచ్చే నెల కోర్టు విచారించనుంది.
అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పతంజలి కరోనిల్‌ను మార్కెట్‌లో విక్రయిస్తుందా, లేదా అన్న విషయంలో స్పష్టత రాలేదు. కానీ మద్రాస్ హైకోర్టులో విచారణ అనంతరం ఇచ్చే తీర్పును బట్టి పతంజలి నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.