సీబీఐ అడిషనల్ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని… లక్ష జరిమానా విధించి కోర్టు బెంచ్ విశ్రాంతి కోసం లేచే వరకు గదిలో ఓ మూలన కూర్చోవాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది. బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ రేప్ కేసులోనే కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ సంచలనాత్మక తీర్పును సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించారు. నాగేశ్వర రావుతో పాటు లీగల్ అడ్వయిజర్ కు కూడా జరిమానా విధించింది కోర్టు. ఆయనకు కూడా అదే శిక్ష విధించింది.
అసలు ఏం జరిగిందంటే.. బీహార్ లోని ముజఫర్ పూర్ వసతి గృహాల్లో వేధింపుల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. అయితే.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి శర్మను కోర్టు అనుమతి లేకుండా మార్చకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నాగేశ్వరరావు.. శర్మను బదిలీ చేశాడు. దీంతో కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా శర్మను బదిలీ చేయడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని నాగేశ్వరరావుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.
నోటీసులపై స్పందించిన మన్నెం.. సుప్రీంకు క్షమాపణలు చెప్పుతూ అఫిడవిట్ ఫైల్ చేశాడు. ఇవాళ విచారణకు హాజరయ్యాడు. విచరణ సమయంలో వాదోపవాదాలు జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తరుపున వాదిస్తున్న అటార్నీ జనరల్ పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరికీ జరిమానా విధించి ఈ వినూత్నమైన శిక్ష విధించారు.