Video : ఘోరం.. పార్కు సిబ్బంది నిర్లక్ష్యం.. క‌రెంట్ షాకుతో బాలుడి మృతి..!

-

6 year old boy killed with current shock in narsingi
6 year old boy killed with current shock in narsingi

విద్యుత్ షాక్‌తో అభం శుభం తెలియ‌ని ఓ ప‌సివాడు మృత్యువాత ప‌డ్డాడు. హైద‌రాబాద్‌ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌ద‌రు క‌మ్యూనిటీకి చెందిన పార్క్‌లో ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా అత‌ని ప‌క్క‌నే ఉన్న ఓ విద్యుత్ స్తంభాన్ని ప‌ట్టుకోవ‌డంతో అత‌ను విద్యుదాఘాతానికి గురై తీవ్ర‌గాయాల పాలై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే…

హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న నార్సింగిలోని పెబెల్ (పీబీఈఎల్‌) గేటెడ్ క‌మ్యూనిటీలోని పార్కులో నిన్న రాత్రి మౌనీష్ (6) అనే బాలుడు స్నేహితుల‌తో క‌లిసి బాల్ ఆట ఆడుకుంటున్నాడు. అయితే బాల్ అనుకోకుండా ప‌క్క‌నే ఉన్న ఓ ల్యాంప్ పోల్ వ‌ద్ద ప‌డింది. దీంతో బాల్‌ను తీసుకునేందుకు మౌనీష్ పోల్ వ‌ద్ద‌కు వెళ్లి ఆ పోల్‌ను ప‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో అండ‌ర్ గ్రౌండ్‌లో ఉన్న వైర్లు తాకి అత‌ను విద్యుదాఘాతానికి గుర‌య్యాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన మౌనీష్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

కాగా మౌనీష్ కు క‌రెంట్ షాక్ కొట్టిన‌ప్పుడు ప‌క్క‌నే తోటి బాలురు, పెద్ద‌లు రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్లారు. కానీ ఒక్క‌రూ స్పందించ‌లేదు. మౌనీష్ పోల్‌ను ప‌ట్టుకుని ఆడుకుంటున్నాడు అని వార‌నుకున్నారు. దీంతో ఎవ‌రూ స్పందించ‌లేదు. ఫ‌లితంగా ఓ ప‌సివాడు మృత్యువు బారిన ప‌డ్డాడు. కాగా మౌనీష్‌కు క‌రెంట్ షాక్ కొట్టిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు కూడా రికార్డ‌య్యాయి. అయితే పోల్ ల్యాంప్ ద‌గ్గ‌ర ఉన్న అండ‌ర్ గ్రౌండ్ కేబుల్స్‌పై మూత ఉండేద‌ని, కానీ రిపేర్ల నిమిత్తం ఆ మూత‌ను తీసిన క‌మ్యూనిటీ సిబ్బంది, రిపేర్ అయ్యాక ఈ మూత‌ను పెట్ట‌డం మ‌రిచిపోయార‌ని, దీంతో అక్క‌డే ఉన్న విద్యుత్ వైర్లు మౌనీష్‌కు తాకాయ‌ని, అందుకే మౌనీష్ చ‌నిపోయాడ‌ని తెలిసింది. దీనికి క‌మ్యూనిటీ నిర్వాహ‌కులు, సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేర‌కు వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మౌనీష్ త‌ల్లిదండ్రులు చెన్నైలో ఉంటున్నార‌ని, అత‌ని తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడ‌ని తెలిసింది. దీంతో మౌనీష్ మృత‌దేహాన్ని కూడా అక్క‌డికే త‌ర‌లించార‌ని స‌మాచారం. కాగా మౌనీష్ మృతిపై ఆ క‌మ్యూనిటీలో నివాసం ఉండే ఇత‌ర కుటుంబాల‌కు చెందిన వారు కూడా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. తాము మెయింటెనెన్స్ కోసం నెల నెలా భారీగా డ‌బ్బులు చెల్లిస్తున్నా నిర్వాహ‌కులు మాత్రం క‌మ్యూనిటీని స‌రిగ్గా మెయింటెయిన్ చేయ‌డం లేద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఆ క‌మ్యూనిటీలో మొత్తం 1300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఏది ఏమైనా.. కొంద‌రు ప్ర‌బుద్ధుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ అమాయ‌కుడి ప్రాణాలు గాల్లో క‌ల‌సిపోయాయి..!

Read more RELATED
Recommended to you

Latest news