అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు సుప్రీంలో చుక్కెదురైంది. ఎరిక్సన్ కంపెనీకి సంబంధించిన వివాదంలో ఆయనకు సుప్రీంలో భారీ షాక్ తగిలింది. స్వీడన్ కు చెందిన ఎరిక్ సన్ కంపెనీకి 4 వారాల్లో 453 కోట్ల రూపాయలు చెల్లించాలని అంబానీని సుప్రీం కోర్టు ఆదేశించింది.
4 వారాల్లో ఆ డబ్బు కట్టలేకపోతే మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం అనిల్ అంబానీని హెచ్చరించింది. ఈ తీర్పును జస్టిస్ నారీమన్, జస్టిస్ వినీత్ సహరన్ లతో కూడిన ధర్మాసనం వెలువరించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అని అంబానీ.. ఎరిక్ సన్ ఇండియాకు రూ.550 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆర్ కాం కంపెనీ ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఎరిక్ సన్ కు సరైన సమయంలో బకాయిలు చెల్లించలేకపోయింది. దీంతో ఆర్ కాం కంపెనీని రిలయన్స్ జియోకు అమ్మి డబ్బులు సమకూర్చాలని భావించింది. కానీ.. అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో నిధులు లేక ఎరిక్ సన్ కు సరైన సమయంలో డబ్బులు చెల్లించలేకపోతున్నట్టు అనిల్ కోర్టుకు తెలిపారు.
దీంతో గత సంవత్సరం డిసెంబర్ 15 లోగా బకాయిలన్నీ చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 15 లోగా చెల్లించకుంటే… 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినప్పటికీ… అనిల్.. ఎరిక్ సన్ కు బకాయిలు చెల్లించలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద అనిల్ అంబానీకి జైలు శిక్ష విధించాలని ఎరిక్ సన్ సుప్రీంను ఆశ్రయించింది. దీంతో కోర్టు తాజాగా ఈ తీర్పును జారీ చేసింది.