హోటల్‌ గది నచ్చకే సురేష్‌ రైనా ఐపీఎల్‌ నుంచి నిష్క్రమణ..?

-

ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేష్‌ రైనా పూర్తిగా తప్పుకున్న విషయం విదితమే. అయితే రైనా తప్పుకోవడంతో చెన్నై టీంకు అలాంటి బ్యాట్స్‌మన్‌ను వెదకడం కష్టంగా మారింది. మరోవైపు రైనా తప్పుకోవడం వెనుక తాను చెప్పిన వ్యక్తిగత కారణాలు లేవని, ఇంకో ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తోంది. దుబాయ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీం బస చేసిన హోటల్‌లో కెప్టెన్‌ ధోనీకి చాలా ప్రత్యేకమైన గది కేటాయించారని తెలిసింది. అయితే తనకు ఇచ్చిన రూం బాగా లేదని, రూం మార్చమని రైనా టీం మేనేజ్‌మెంట్‌ను కోరాడట. కానీ అందుకు మేనేజ్‌మెంట్‌ విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందువల్లే రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడని సమాచారం.

suresh rains exited ipl because he not liked his room

అలాగే చెన్నై టీంలో ఇప్పటికే ఒక బౌలర్‌, ఒక బ్యాట్స్‌మన్‌తోపాటు మరో 12 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇలాంటి స్థితిలో తనకూ కరోనా సోకుతుందేమోనని కలత చెంది కూడా రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడని తెలిసింది. అయితే ధోనీ, రైనా నిజానికి మంచి ఫ్రెండ్స్‌. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే రైనా కూడా రిటైర్మెంట్‌ ఇచ్చేశాడు. ఇక టీమిండియాలో ధోనీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులూ రైనాను వెనకేసుకు వచ్చాడు. అతనికి సపోర్ట్‌గా నిలబడ్డాడు. పరుగులు సాధించడంలో రైనా ఫెయిల్‌ అయినా ధోనీ అతని వెన్నంట నిలిచాడు. అలాంటిది రూం బాగా లేదని చెప్పి రైనా వెళ్లి పోయాడంటే.. అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. ధోనీ ఈ విషయంపై రైనాతో ఏమీ మాట్లాడలేదా ? రైనా టోర్నీ నుంచి తప్పుకుంటానంటే ధోనీ ప్రశ్నించలేదా ? వేరే గది కావాలని అడిగితే ధోనీ ఇప్పించలేదా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.

కాగా ధోనీ, రైనాల మధ్య అసలు ఏం జరిగి ఉంటుంది ? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. రైనా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నానని చెప్పినా.. అసలు అది కారణం కాదని, ప్రధానంగా హోటల్‌ గది విషయంలో మనస్థాపానికి గురైనందు వల్లే టోర్నీ నుంచి తప్పుకున్నాడని తెలిసింది. అయితే తమ జట్టు సభ్యులు కరోనా బారిన పడుతుండడంపై ఆ జట్టు ఓనర్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. ధోనీపై తనకు నమ్మకం ఉందని, అతను జట్టును అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాడని, కరోనా పాజిటివ్‌ కేసులు తమ జట్టులో పెరిగినా ఇబ్బంది ఏమీ లేదని ప్రకటించారు. అయితే ఐపీఎల్‌ టోర్నీలో సీఎస్‌కే ఈసారి ఎలా రాణిస్తుందన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news