తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకంగా నిలిచిన విషయం తెలిసిందే. సబ్బండ వర్ణాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తిరుగుబాటు వావుటాను ఎగురవేశాయి. అప్పటి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ఉద్యమంలో ముందుండి నడిపించిన ఎంజీఓ నేత స్వామి గౌడ్. గత కొంత కాలంగా అధికార పార్టీపై గుర్రుగా వుంటున్నారు. కేసీఆర్ ప్రోద్భలంతో మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన స్వామిగౌడ్ గత కొంత కాలంగా గులాబీ నేత పేరెత్తితే చాలు ఒంటికాలిపై లేస్లున్నారు.
ఇటీవల పార్టీపై ధిక్కార స్వరం వినిపించి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్వామిగౌడ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా సాక్షిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తి ఆశ్చర్యపరిచారు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలోనే అయినా బడుగు వర్గాలకు ఆయన చేతికర్రగా మారారని ప్రశంసల వర్షం కురిపించారు. గడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలలిచిన వారిని గుర్తించి మనం వారికి అండగా వుండాలన్నారు. తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాక్ష్యాత్తు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే నిప్పులు చెరిగారు. ఆయన వ్యవహార తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యమ కారుల్ని లెక్కచేయడం లేదని, ఉద్యమాన్ని, ఉద్యమ కారుల్ని అవహేళన చేసిన వారికే పార్టీలో పట్టం కడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యమ కారులు కలవాలని ప్రయత్నించినా వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, వారిని కలవకపోతే ఇంకెవరిని కేసీఆర్ కలుస్తారని ప్రశ్రించారు స్వామిగౌడ్. పార్టీలో ఇంతగా ధిక్కార స్వరం వినిపిస్తున్నా తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని మారనని, అలాంటి ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. ఉన్నట్టుండీ స్వామిగౌడ్ గులాబీ దళపతిపై ధక్కార స్వరం పెంచడానికి కారణం ఏంటని అంతా ఆరాతీస్తున్నారు. స్వామిగౌడ్‌ది రాజేంద్ర నగర్ నియోజక వర్గం. ఈ కానిస్టెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది స్వామి గౌడ్ కోరిక. ఆ కోరికని అదిష్టానం ముందు వెల్లడించినా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అదీ కాక రాజేంద్ర నగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ని తెరాస తన పార్టీలో చేర్చుకుంది. దీంతో స్వామి గౌడ్‌కి చెక్ పడినట్టయింది. ఇక్కడి నుంచే స్వామి గౌడ్ కేసీఆర్‌ని ధక్కరించడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ దూరం ఏ తీరానికి ఆయనని చేరుస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.