ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా దేశంలో ఎదురవుతున్న ప్రకృతి సిద్ధ సమస్యలతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి! మూడోప్రపంచ యుద్ధానికి సమయం ఆసన్నమవుతుందని ఒకరంటే… ప్రపంచం అంతమయ్యే ముందు సూచనలు ఇవి అని మరికొందరు అంటున్నారు! దీనికి కారణం… ఒకపక్క కరోనా వైరస్ భయంతో ప్రజలు అల్లల్లాడిపోతూ ఉంటే… మరోపక్క మిడతల దండు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తుంది! చిత్రం ఏమిటంటే… ఈ రెండు సమస్యలూ గతంలో సూర్య నటించిన సినిమాల్లో జరిగినట్లే ఉండటం!
అవును… సూర్య నటించిన “సెవెన్త్ సెన్స్”, “బందో బస్త్” చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అచ్చు అలానే ఉన్నాయనే అంగీకారానికి రాక మానరు! “సెవెన్త్ సెన్స్” సినిమాలో చైనా ఓ వైరస్ ను ఇండియాపై ప్రయోగిస్తుంది. ముందుగా కుక్కలపై ప్రయోగించి తద్వారా మొత్తం మనుషులందరికీ ఆ వైరస్ సోకేలా ప్లాన్ చేస్తుంది. అనంతరం ఆ వైరస్‌తో భారత్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. సరిగ్గా ఆలోచిస్తే… ప్రస్తుత కరోనా సమస్యకు ఆ కాన్సెప్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. కరోనా వైరస్ చైనా నుంచే కదా భారత్ కు వచ్చింది!
ఇదే సమయంలో భారత్ ను వేదిస్తోన్న మరో తాజా సమస్య “మిడతల దండు! సూర్య హీరోగా నటించిన మరో సినిమా “బందోబస్త్”లో కూడా విలన్ “మిడతల దండు”ను ట్రైన్ లో తీసుకొచ్చి భారత్ లో ప్రయోగించి లబ్ధి పొందాలనుకుంటాడు. సరిగ్గా ఆసినిమాలో చూపించినట్లుగానే… ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన మిడతల దండు.. భారత్ లోని పంటపొలాన్ని నాశనం చేసేస్తున్నాయి. అవంటే సినిమాలు కాబట్టి హీరో రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరించేశాడు. కానీ.. ఇది నిజజీవిత సమస్య కాబట్టి… కరోనా విషయంలో ప్రతి వ్యక్తీ జాగ్రత్తలు తీసుకుంటూ హీరో కావాలి… మిడతల విషయంలో ప్రతీ సర్కారు, ప్రతీ రైతు వాటిని ఎదుర్కుని నాశనం చేస్తూ హీరో కావాలి!!