విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి బందోబస్తు, తదితర ఏర్పాట్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కి వస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు గ్రేటర్ ప్రజా ప్రతినిధులు హాజరవుతారని, బేగంపేట నుండి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకు ర్యాలీ గా వస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ లో పాల్గొనే వారందరు ఇక్కడ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. బీజేపీ మీటింగ్ జరుగుతుందని, ఇంకోవైపు యశ్వంత్ సిన్హా సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
రేపు యశ్వంత్ సిన్హా ని సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకుంటారని, ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ దేశానికి చేసింది ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు ఎన్ని చేసిన తెలంగాణలో పప్పులు ఉడకవని, రేపు హైదరాబాద్ కి వచ్చే నేతలు హైదరాబాద్ అందాలని చూస్తారన్నారు. ఈ మూడు రోజులు టూరిస్తుల్లాగా వస్తున్నారు. వచ్చి చూసి పోతారనంటూ ఎద్దేవా చేశారు. దేశంలో మార్పు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి మూడేళ్లయ్యింది, సికింద్రాబాద్ లో ఏ పని చేసాడని ఆయన ప్రశ్నించారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదని ఆయన ఉద్ఘాటించారు. ఇక్కడ టీఆర్ఎస్ నేతలు మాత్రమే పాల్గొంటారు. ఇతర ఏ రాజకీయ పార్టీ పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు.