తెలంగాణ కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేయడానికి ముందు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
బాల్యం: తమిళ సై సౌందర్‌రాజన్ కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో 1961 జూన్ 2న ఆమె జన్మించారు. ఆమె తండ్రి అనంతన్ పార్లమెంటు మాజీ సభ్యుడే కాకుండా, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా. తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవారు. తమిళిసై భర్త సౌందరరాజన్ కూడా వైద్యుడే.
రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చింది?
చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్స్ లీడర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. బీజేపీకి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. మిళనాడు రాష్ట్ర బీజేపీ విభాగంలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. 2010లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, ఆ తర్వాత 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఆగస్టు 16న తమిళనాడు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలవలేదు. ఇటీవల జరిగిన తమిళనాడు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున ఆమె రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు.
ఎన్నికల్లో …?
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ సై సౌందరరాజన్. నేడు తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమించబడిన బీజేపీ మహిళా నేత. ప్రత్యక్ష ఎన్నికల్లో అటు అసెంబ్లీకిగానీ, ఇటు లోక్ సభకు గానీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయినప్పటికీ, పార్టీ పట్ల ఆమె చూపిన అంకితభావం, నిబద్ధతలకు ఇంతకాలానికి ఓ మంచి గుర్తింపు లభించింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సౌందరరాజన్, కొంతకాలం పాటు డాక్టర్ వృత్తిలోనూ కొనసాగారు. ఆపై బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై, సుమారు రెండు దశాబ్దాల క్రితమే పార్టీలో చేరి, రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టిలో పడ్డారు. 2006, 2011లో ఎమ్మెల్యేగా, 2009, 2019లో కళిమోనిపై తుత్తుకూడి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆమెను విజయం వరించలేదు.
లోకల్ పార్టీల ప్రభావం, ముఖ్యంగా అన్నాడీఎంకే, డీఎం
కేల ప్రాబల్యం అధికంగా ఉన్న తమిళనాడులో, బీజేపీ ప్రభావం నామమాత్రమే కావడంతో, బరిలో ఉన్న అభ్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడం మినహా, ఎన్నడూ ఆమె విజయం సాధించలేదు. అయినప్పటికీ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, వారి తప్పుడు విధానాలను ఎండగట్టడంలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఆమె సేవలకు గుర్తింపుగా రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అందించిన అధిష్ఠానం, ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా ప్రమోషన్ ఇచ్చింది.