ఏపీ రాజకీయాల్లో మరోసారి అందరూ ఊహించినట్టే జరిగింది… అనుకున్నంత అయ్యింది. ఊగిసలాటకు చెక్ చెబుతూ రాయలసీమ సీనియర్ నేత, టీడీపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పచ్చ జెండాకు గుడ్ బై చెప్పడం ఖాయమైపోయింది. ఆదినారాయణరెడ్డ పార్టీ మార్పుపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆది నారాయణ రెడ్డి కలిశారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకున్నారు. ఆది టీడీపీలోనే ఉంటాడని టీడీపీ ప్రకటించింది. వెంటనే షాక్… శనివారమే ఆయన ప్రెస్‌మీట్ పెట్టేసి తనకు దేశభక్తి ఎక్కువని… అందుకే బీజేపీలోకి వెళుతున్నానని ప్రకటించారు.
ఇక టీడీపీలో కొనసాగుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని చెప్పారు. చంద్రబాబుతో భేటి అయినంత మాత్రాన తాను టీడీపీలోనే ఉంటానని కాదని స్పష్టం చేశారు. దేశభక్తితో పాటు తన ప్రాంత అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. ఇక ఆదినారాయణరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచే గెలిచారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కోసమే టీడీపీలో చేరారు.
ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు ఆ టీడీపీని వీడి బీజేపీలో చేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆది బీజేపీ ఎంట్రీపై ఎవరి లెక్క ఎలా ? ఉన్నా చంద్రబాబు సలహా మేరకే ఆది బీజేపీలోకి వెళుతున్నట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక చంద్రబాబు సలహా మేరకే ఆ పార్టీకే చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం.రమేష్, టీజీ.వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌రావు కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరారు. వీళ్లంతా బాబు డైరెక్షన్ మేరకే కాషాయ కండువా కప్పుకున్నారన్నదే ఎక్కువ మంది అభిప్రాయం.
ఇక బీజేపీలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తనకు అప్‌డేట్ వచ్చేందుకే బాబు గైడెన్స్‌లోనే టీడీపీ వాళ్లంతా బీజేపీలోకి వెళుతున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఏపీ బీజేపీలో కూడా టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ల హంగామానే కనిపిస్తుండడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది.