మృతదేహం ఇవ్వని ఆస్పత్రికి బుద్ధి చెప్పిన డ్రైవర్లు… వీడియో వైరల్…!

-

ఈ రోజుల్లో చాలా వరకు ప్రయివేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ చిన్న దానికి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాదు, కనీసం పేద వారు అనే కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు వైద్యులు. తాజాగా ఇలా ప్రవర్తించిన ఒక యాజమాన్యానికి వేలాది మంది టాక్సీ డ్రైవర్లు ఊహించని షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఇండోనేసియాలోని పడంగ్ నగరంలో ఆరు నెలల ఆలిఫ్ పుతుర్ ఒక ప్రమాదకరమైన వ్యాధితో ఆస్పత్రిలో మరణించాడు. ఇక అతని వైద్యానికి కూడా భారీగానే ఖర్చు అయింది.

దాదాపు మన కరెన్సీలో ఒక కోటి 20 లక్షలు ఖర్చు అయింది. దీనితో ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే మార్చురీలో ఉన్న మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీనితో టాక్సీ డ్రైవర్ గా పని చేసే బాలుడి బంధువు ఒకరు… ఈ విషయాన్ని తన తోటి డైవర్లకు చెప్పాడు. వెంటనే వేలాదిగా ఆస్పత్రికి తమ వాహనాలతో వచ్చేసిన డ్రైవర్లు… ఎం జమిల్ ఆస్పత్రికి వచ్చి… వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యానికి అయిన ఖర్చు అంతా చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని పట్టుబట్టింది ఆస్పత్రి యాజమాన్యం. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్లు…

మార్చురీలో ఉన్న మృతదేహాన్ని భద్రతా సిబ్బందిని దాటుకుని వెళ్లి బయటకు తీసుకొచ్చి తల్లి తండ్రులకు అప్పగించారు. ఈ సమయంలో తీసిన మొబైల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆస్పత్రి యాజమాన్యం జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పింది. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇండోనేసియాలో వైరల్ గా మారింది. ఇక డ్రైవర్ల తీరు పట్ల కొందరు అసహనం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహానికి అంటు వ్యాధులు ఏమైనా ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news